భారత్‌ తప్పించుకోగలదా? | Sakshi
Sakshi News home page

భారత్‌ తప్పించుకోగలదా?

Published Mon, Oct 2 2023 12:12 AM

Sakshi Guest Column On Justin Trudeau Comments On India

ఖలిస్థానీ సానుభూతిపరుడు, నిషేధిత ‘ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌’ నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణ అత్యంత వివాదాస్పదం అయింది. ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారా సాహిబ్‌ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్‌ని కాల్చి చంపిన నేపథ్యంలో... భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చనేందుకు ‘విశ్వసనీయమైన ఆరోపణలు’ ఉన్నాయని ట్రూడో గత నెలలో తమ పార్లమెంటులో ప్రకటించారు. దరిమిలా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా దెబ్బతింటూ వచ్చాయి. ఈ పరిణామాలను అమెరికాపై దృష్టిని కేంద్రీకరించి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశ స్పందన మనకు అత్యంత కీలకం కాబట్టి!

జస్టిన్‌ ట్రూడో (కెనడా ప్రధానమంత్రి) ఆరోపణలపై మన ప్రభుత్వ ప్రతిస్పందనను నేను విశ్వసిస్తున్నప్పటికీ, ఒక జర్నలిస్టుగా కొన్ని ప్రత్యేకమైన వాస్తవాలను కూడా మన మది పరిగణనలోకి తీసుకోవాలేమోనని నా ఆలోచన. అయితే ఆ వాస్తవాలు అవసరమైనంత మేర కైనా నివేదనకు వచ్చాయని నేను అనుకోవడం లేదు. కొన్నిసార్లు అవి ఉద్దేశపూర్వకమైన విస్మ రణకు కూడా గురయ్యాయి. అందువల్ల వాటిని మీ దృష్టికి తీసుకురావడం నా కర్తవ్యంగా భావిస్తూ, ముగింపును మాత్రం మీకే వదిలేస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయంతో మిమ్మల్ని ప్రభావితం చేయడం నాకు ఇష్టం లేదు. 

మొదటిది– ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఈ ఆరోపణలను లేవనెత్తి ‘‘ఆందోళన వ్యక్తం చేసినట్లు’’ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ రాసింది. యూఎస్‌ఏ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ ‘‘అత్యున్నత స్థాయుల్లో ఈ అంశంపై చర్చ జరిగింది,’’ అని చెప్పినప్పుడే ఆయన ఈ ‘‘అందోళన వ్యక్తం అవడాన్ని’’ ధ్రువీకరించి ఉండొచ్చు. భారత్‌పై కెనడా చేసిన ఈ ఆరోపణలను బైడెన్‌ ఎలా చూస్తున్నారన్న విషయమై ఇది మనకు ఏం చెబుతోంది?

గట్టి సాక్ష్యాలు ఉన్నాయా?
రెండవది– కెనడాలోని అమెరికన్‌ రాయబారి ఒకటీ లేదా అంతకన్నా ఎక్కువ ‘పంచనేత్ర నిఘా కూటమి దేశాలు’ (ఫైవ్‌–ఐస్‌ కంట్రీస్‌: యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా) రహస్య సమాచారాన్ని అట్టావా (కెనడా రాజ ధాని)తో పంచుకున్నట్లు రూఢి పరిచారు. వాటిలో ఒక దేశం యూఎస్‌ఏ అని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది.

ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది: ‘‘చూస్తుంటే కెనడా దగ్గర ‘పొగలు గక్కే తుపాకీ’ (వివాదానికి తావులేని సాక్ష్యం) ఉన్నట్టు కన బడుతోంది. ఆ దేశంలోని భారతీయ దౌత్యవేత్తల సమాచార వ్యవస్థలోకి చొరబడటం అన్నది పన్నాగంలో (వారికి) ప్రమేయం ఉందన్న సంకే తాలను ఇస్తోంది.’’ ఈ చొరబాట్లు ఏం చెబు తున్నాయి? అవి నిజంగానే పొగలు గక్కుతున్న తుపాకీతో సమానమైనవా?

మూడవది – ఆరంభంలో జేక్‌ సల్లివాన్, ఆ మర్నాడు యూఎస్‌ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌: ‘‘మేమే మా కెనడియన్‌ సహోద్యోగులతో చాలా దగ్గరగా సంప్రదింపులు జరుపుతున్నాం. కేవలం సంప్రదింపులు మాత్రమే కాదు, ఈ అంశంపై వారితో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని ప్రకటించారు.

అంటే ఏమిటి? కెనడా దగ్గర ఉన్న సమాచారం ఎలాంటిదో మాత్రమే కాదు,అందులోని నాణ్యత ఎంతటిదో కూడా వాషింగ్‌టన్‌కు అవగాహన ఉందని ఇది సూచిస్తోందా?

నాల్గవది – ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బ్లింకెన్, ‘‘ఈ పరిశోధనలో కెనడాతో కలిసి ఇండియా పని చేయడం చాలా ముఖ్యం. దీనికి బాధ్యులెవరో చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు దానికై అదే జరిగి, ఫలితం వైపునకు దారి తీయాలి’’ అన్నారు. ఆయన అలా అన్నది ఒక పత్రికా సమావేశంలో అయినప్పటికీ అది న్యూఢిల్లీకి ఒక సందేశం అనుకోవాలా?

ఐదవది – ‘‘ఇలాంటి చర్యలకు మీకు కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులేమీ ఉండవు. దేశంతో నిమిత్తం లేకుండా మేము గట్టిగా నిలబడి, మా ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటాం’’ అని సల్లివాన్‌ అనడం చూస్తుంటే, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ఎవరిది అబద్ధం?
ఆరవది–కెనడా జాతీయ భద్రతా సలహాదారు జోడీ థామస్‌... కెనడా ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్‌ హెడ్‌తో కలిసి ఆగస్టులో నాలుగు రోజులు, సెప్టెంబరులో ఐదు లేదా ఆరు రోజులు ఢిల్లీలో ఉండి, భారత నిఘా సంస్థలకు సమాచారం అందించినట్లు కెనడియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ వెల్ల డించింది. అయితే భారత ప్రతినిధి మాత్రం... ‘‘కెనడా అప్పుడు గానీ, ఇప్పుడుగానీ, ఎప్పుడూ గానీ తమతో ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని పంచుకోలేదు’’ అని పేర్కొన్నారు. మరి అలాంటి సమాచారం ఏదీ లేకుంటే జోడీ థామస్‌ భారత దేశంలో పది రోజుల పాటు ఎందుకు గడిపినట్లు?

ఏడవది– మన భారత ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి కెనడాను... ‘‘ఉగ్రవాదులకు, తీవ్రవాదు లకు, వ్యవస్థీకృత నేరాలకు సురక్షితమైన స్వర్గ ధామం’’ అని పేర్కొన్నారు. ఆ మాటలు సాధార ణంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వాడుతుంటారు. అలాంటిది తమ నాటో మిత్రపక్షం, జీ–7 సభ్య దేశం, మరీ ముఖ్యంగా సన్నిహిత, సాంస్కృతిక పరిచయాలు కలిగిన తమ పొరుగు దేశం అయిన కెనడా గురించి ఇండియా అలా అనడాన్ని అమెరికా ఎలా చూస్తుంది?

అమెరికా వైఖరి కీలకం
ఎనిమిదవది– అట్లాంటిక్‌కు ఇరు వైపులా ఉన్న అనేక ఆంగ్ల భాషా వార్తాపత్రికలు భారతదేశం ఇలా ఎలా మారిందీ అని ప్రశ్నల్ని లేవదీశాయి. ఉదాహరణకు, ‘ది అబ్జర్వర్‌’ పత్రిక ‘‘స్వదేశంలో, విదేశాలలో మోదీ ప్రభుత్వ విధానం ప్రజా స్వామ్యం పట్ల ఆ దేశ నిబద్ధత, భాగస్వామ్య దేశంగా తన విశ్వసనీయతల పైన సందేహాలను లేవనెత్తుతోంది’’ అని రాసింది. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కాలమిస్ట్‌ నికోలస్‌ క్రిస్టోఫ్‌ పాకిస్తాన్‌ పాలకుడు జనరల్‌ జియాతో మోదీని పోల్చారు. ‘ది ఎకనామిస్ట్‌’ నిర్మొహమాటంగా ‘‘ఇది కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం’’ అని పేర్కొంది. మన దేశం గురించి ఇలాంటి వ్యాఖ్య లన్నిటికీ మనం ఎలా స్పందించాలి?

చివరిగా– ఒక అధికారిక ప్రకటనలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రూడో ఆరోపణలను ‘‘పూర్తిగా తిరస్కరించింది’’. వాటిని ‘‘అసంబద్ధము, ప్రేరణపూరితమూ అయినవి’’గా పేర్కొంది. బైడెన్‌ గురించి మనకు తెలిసిన దానిని బట్టి... అలాగే సల్లివాన్, బ్లింకెన్‌ల ప్రకటనలను బట్టి చూస్తే అమెరికా ఈ ప్రతిస్పందనను అంగీ కరిస్తుందని అనుకోవచ్చా?

ఇప్పుడు నేను అమెరికా పైననే నా దృష్టిని కేంద్రీకరించాను. ఎందుకంటే ఆ దేశ ప్రతిస్పందన చాలా ముఖ్యమైనది. భారత్‌ కేవలం ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటుండగా, బ్లింకెన్‌ అంటున్న ‘అంతర్జాతీయ అణచివేత’లో దోషి కచ్చితంగా అమెరికానే అని నాకు తెలుసు. అయినప్పటికీ అమెరికా దీని నుంచి పదే పదే తప్పించుకుంటూ వచ్చింది. భారత్‌ కూడా అలా తనపై వచ్చిన ఆరో పణల నుంచి తప్పించుకోగల స్థితిలో ఉందా?
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement