ఫాన్స్‌తో వ్యవహారం మామూలుగా ఉండదు..అదొక మనస్తత్వ శాస్త్రం! | Sakshi
Sakshi News home page

అభిమానంతో వచ్చే చిక్కులు..వారితో వ్యవహారం మాములుగా ఉండదు!

Published Fri, Jun 23 2023 3:25 PM

Many Heroes Think Fans Are Asset But They Are Bulwark Their Neck - Sakshi

అది న్యూస్ రిపోర్టర్ల వాట్సాప్ గ్రూప్. అందులో ఒక వీడియో. ఆ వీడియోలో.. కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ ముందు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన వారిని "సినిమా ఎలా వుంది ? అని అడుగుతున్నారు . సాధారణంగా " సూపర్ " " హండ్రెడ్ డేస్ " వెయ్యి రోజులు ఖాయం " కలియుగాంతం దాకా ఈ సినిమా ఆడుతుంది " అని ఇలాంటి సందర్బాల్లో సమాధానాలు వస్తుంటాయి . అది అభిమానులు చెప్పే మాటలో లేక మానేజ్ చేసినవో తెలియదు. లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సినంత సీన్ లేదు. ఇలాంటి వీడియో ఒకటి ఉంటుంది అనుకొని దాన్ని చూడలేదు.

ఆ గ్రూప్లో వచ్చిన కామెంట్స్ చూసి అసలు వీడియోలో ఏముందో అని క్లిక్ చేసి డౌన్ లోడ్ అయ్యాక చూసా. ఎవరో వ్యక్తి సినిమా బాగోలేదు అని కామెంట్ కామెంట్ చేసాడు. దానితో అక్కడ ఉన్న అభిమానులు అతనిపై దాడి చేసారు. చూడగానే మనసు చివుక్కు మంది. ఆ వ్యక్తి తన మనసులోని ఫీలింగ్స్ చెప్పాడో లేదా కావాలనే దుష్ప్రచారం చేసాడో .. తరువాతి మాట . సినిమా బాగా లేదు అనగానే దాడి చేస్తారా ? మనం ఏమైనా తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అనిపించింది. హీరోల అభిమానులు అలాగే ఉంటారని మా బాల్యంలో చెప్పుకునేవారు. ఒకప్పుడూ ఎంజీఆర్‌ సినిమా తొలి రోజు సినిమాకు వెళితే అయన అభిమానులు తలతో ఫైట్ చేసేవారట. అమాయకుడు ఎవరైనా వెళితే తలపగలడం ఖాయం అట.

అది ఎంత వరకు నిజమో కానీ ఫాన్స్ వ్యవహారం మామూలుగా ఉండదు . అదొక సామాజిక- మనస్తత్వ శాస్త్ర టాపిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకమయిన మానసిక రుగ్మత. కాలం మారినా దక్షిణాదిన ఈ ధోరణి మారలేదు. అభిమానులు తమకు అసెట్ అని చాలా మంది సో కాల్డ్ హీరోస్ అనుకొంటారు. అభిమానులు వీరి మెడకు వేలాడే గుదిబండలు అని .. పాపం గ్రహించలేరు. అంత తెలివితేటలు ఉండే అవకాశం తక్కువ. భ్రమల లోకంలో బతికేస్తుంటారు . సాగినన్నాళ్లు సాగుతుంది. ఒక్కోసారి ఆకాశం నుంచి నేలకు పడిపోతారు. నిన్నటి హీరో.. పాపం తీవ్ర డిప్రెషన్ తో బాధ పడుతున్నాడు . ఇంకా ఎంతో మంది ఇలాంటి కోవలో ఉన్నారో లేదా కాస్త తక్కువ స్థాయిలో డిప్రెషన్‌లో ఉన్నారు అనేదాని గురించి మాట్లాడడం .. విశ్లేషించడం టైం వేస్ట్.

చిత్రమయిన విషయం ఏమిటంటే అంత బహిరంగంగా దాడి చేయడం. నిజానికి ఇది తప్పు .. మీకు అభిమానం ఉంటే సినిమా ఎందుకు బాగోలేదో చెప్పుమని అడగొచ్చు అంతే గాని దాడి చెయ్యడం ఏంటి ? అని ఎవరూ అడిగినట్లు లేరు . పోలీస్లు ఏమి చేసారో తెలియదు. అటుపై ఇంకో వీడియో చూసా. దాడి జరిగిన వ్యక్తి .. హీరో నన్ను ఇంటికి పిలిస్తే సంతోష పడుతాను అంటున్నాడు . అలాంటివి జరగవు అని నాకు తెలుసు. ఒక వేళా హీరో జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నా అభిమానులు .. సలహాదారులు చెప్పనివ్వరు. నెక్స్ట్ సీన్.. ఫేస్‌బుక్‌  ఫ్రెండ్ .. ఓ మహిళ. ఆ మధ్యలో మెసెంజర్లో లండన్ గురించి సమాచారం ఇచ్చారనుకొంటా! నా పోస్ట్ల పై కామెంట్స్ పెడుతుంటారు . నేను లోతుగా పరిశీలించలేదు. ఆమెకు దేవుడంటే భక్తి . విదేశాల్లో ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే అమితంగా ఇష్ట పడే వ్యక్తి. ఆమె ఆ సినిమా నచ్చలేదని పోస్ట్ పెట్టినట్టున్నారు . దాని పై కొంత మంది తనని టార్గెట్ చేసుకొంటూ ఎలా మాట్లాడింది అంటూ.. పోస్ట్‌లు పెట్టారు . నేను ఎప్పుడో కానీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఇతరుల పోస్ట్లు చూడను. అనుకోకుండా ఈ పోస్ట్ కనిపించింది.

ఆ సినిమాను విమర్శించింది కాబట్టి ఆమె హిందువు కాదు అని.. ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేసారని అర్థం అయ్యింది. సినిమా సినిమానే . జీవితం కాదు. ఒకే ఇంట్లో ఒకరికి సినిమా నచ్చోచ్చు. ఇంకొరికి నచ్చక పోవచ్చు. అదేమీ అసాధారణం కాదు. సినిమా నచ్చకపొతే ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు . ఒకవేళ..లేదు సినిమా బాగుంది .. ఈ కోణం లో చూడాలి" అని కామెంట్ చెయ్యడం సమంజసం. తప్పు లేదు. కానీ వ్యక్తిగత దాడి చేయడానికి అసలు ఎవరు మీరు ? సినిమా అభిమానులా ? హీరో అభిమానులా? అంటే కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఒక పార్టీ అభిమానులు (అందరూ కాదు .. కొందరు ) ఇలా పోస్ట్ లు పెట్టడాన్ని చూసాను. ఇదేమి పార్టీ వ్యవహారం కాదు. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వదు . వీరికి సినిమా నచ్చితే దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు.

సినిమాపై వస్తున్న విమర్శల్ని కూడా తిప్పి కొట్టొచ్చు. కానీ ఆ క్రమం లో వ్యక్తిగత కామెంట్స్ చేయడం .. పిచ్చి పిచ్చి లాజిక్లు తియ్యడం .. సినిమాను విమర్శించిన వారందరూ సంఘ వ్యతిరేఖ శక్తులు వీరికి భక్తి లేదు .. దేవుడంటే నమ్మకం లేదు అని కామెంట్స్ చెయ్యడం .. ఈ పనులు వల్ల వీరు ఏమి సాధించారో నాకైతే అర్థం కాలేదు. మొదట్లో సదరు హీరోపై నాకు సధాభిప్రాయం ఉండేది. కష్టపడుతాడు, అనుకొన్నది సాధించాలన్న పట్టుదల ఉంది అనుకొనే వాడిని. ఆ సినిమాపై, ప్రారంభంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు . కానీ ఈ అభిమానులు చేసిన రచ్చ తరువాత ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది.

నాలా నెగటివ్ ఫీలింగ్స్ తెచ్చుకొన్నవారు కచ్చితంగా వేలల్లో/లక్షల్లో వుంటారు. చాలా మంది అన్నీ గమనిస్తుంటారు. జరుగుతున్న దాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అభిమానం అంటే నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించడం. అంతే కానీ తనకు నచ్చనిది అవతలి వారు చెప్పారు కనుక వారిపై మాటలతో దాడికి రెడీ అవ్వడం కాదు. అత్యుత్సాహంతో ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్ చెయ్యడంతో నొచ్చుకొన్న ఆమె " ఛీ .. మీరు ఇలాంటి వారా?" అంటూ మొత్తం ఆ ఐడియాలజీ వర్గాన్ని అసహ్యించుకొంటూ పోస్ట్ పెట్టారు . సెల్ఫ్ గోల్ వేసుకోవడం అని దీన్నే అంటారని  చెబుతున్నారు.మానసిక శాస్త్ర పరిశోధకులు,

- వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త.

(చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్‌ అధ్యక్షుడు)

Advertisement
 
Advertisement
 
Advertisement