పనిచేసే చోట అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏం చేయాలంటే.. | Sakshi
Sakshi News home page

పనిచేసే చోట అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఏం చేయాలంటే..

Published Thu, Dec 7 2023 11:41 AM

How To Build Good Working Relationships In Office - Sakshi

ఆఫీసు అంటేనే అక్కడ ఉన్న అందరితోనూ కలిసి పని చేయాలి. ఇలాంటప్పుడు ఎవ్వరితోనైనా కలిసి ఎలా పని చేయాలి? వర్కప్లేస్‌ ఎక్స్‌పర్ట్, స్పీకర్, రైటర్, హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌ అమీ గలో కార్యాలయాలలో ఎలా ఉండాలో పుస్తకంగా మన ముందుకు తీసుకువచ్చారు. ‘గెటింగ్‌ ఎలాంగ్‌’ అనే ఈ బుక్‌ ఇప్పుడు పని ప్రదేశాల్లో ఉండే ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాలలో ఎదుర్కొనే సమస్యలను అమీ గలో వివిధ రంగాల నుండి స్వయంగా సేకరించింది. ఈ యేడాది చదివి తెలుసుకోదగిన పుస్తకాలలో అమీ బుక్‌ ప్రముఖంగా నిలిచింది. వర్క్‌ ప్లేస్‌లో ఎలా ఉండాలో అమీ సేకరించిన విషయాలు, సూచించిన పరిష్కారాలు ఉద్యోగులందరికీ ఎంతగానో తోడ్పడుతున్నాయి. 

పనిలో సంఘర్షణ ఉంటుంది. పనిచేసే చోట సంబంధాలు కఠినంగా ఉంటాయి. వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఒత్తిడి ఉంటే మన సృజనాత్మకత, ఉత్పాదకత కూడా తగ్గుతుంది. స్పష్టంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమూ తగ్గుతుంది. ఈ విషయాల గురించి రాత్రిపూట ఆందోళన చెందుతూ నిద్రలేని రాత్రులు గడపవచ్చు. ఈ ప్రవర్తన చేస్తున్న ఉద్యోగం వదులుకునేలా చేస్తుంది. చేస్తున్న పని నుండి బయటకు వచ్చేసి, ఆ తర్వాత పశ్చాత్తాప పడవచ్చు.

మీటింగ్‌లో కళ్లు తిప్పడం, ఎగరేయడం, సహోద్యోగులపై విరుచుకుపడటం లేదా మనం మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండటం కూడా మనల్ని ఉద్యోగం నుంచి వేరు చేస్తాయి. చాలావరకు నవ్వుతూ, వేరే మార్గం లేనట్టుగా వ్యక్తులను భరిస్తుంటారు. సరైన పరిష్కారాలు తెలియక హానికరమైన ప్రవర్తనలను భరిస్తుంటారు. ఇక్కడ చూడాల్సింది మనలోని చిత్తశుద్ధి, కెరియర్‌ మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. 

వర్క్‌ప్లేస్‌ ఎక్స్‌పర్ట్‌ అమీ ‘గెటింగ్‌ ఎలాంగ్‌’లో కష్టతరమైన సహోద్యోగులను గుర్తించి, ఇలా మన ముందుంచింది. 
సరైన బాస్‌ లేకపోవడం: వీరిపై ఉద్యోగుల్లో విశ్వాసం ఉండదు. ఫలితంగా ఏదో విధంగా మేనేజ్‌ చేస్తుంటారు. ఇలాంటి బాస్‌ తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాని గురించే ఎక్కువ ఆందోళన చెందుతారు. నిర్ణయాలు తీసుకోవడానికి, కట్టుబడి ఉండటానికి కష్టపడవచ్చు. 
►  నిరాశగా ఉండేవారు: ఇలాంటి వారితో సరైన ప్రోత్సాహం, కెరీర్‌లో పెరుగుదల ఉండదు. 
►  దూకుడుతనంగా ఉండటం: సహోద్యోగులు తమ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే ధోరణి ఉండదు. తాము ఏదైనా తెలియజేయడానికి పరోక్ష పద్ధతులను ఉపయోగిస్తారు. ఎప్పుడూ ఇతరుల అవసరాలను తీర్చడానికి ఉన్నట్టు కనిపిస్తారు. 
► అన్నీ తెలుసు అనే ఆలోచన: అత్యంత తెలివైన వారిగా చూపించుకోవడానికి తపన పడుతుంటారు. తగినంత సమాచారం లేకపోయినా, చెప్పేది తప్పు అని తెలిసినా తనదే కరెక్ట్‌ అనే ధోరణలో ఉంటారు. 
► హింసించే వ్యక్తులతో ఎప్పుడూ ప్రమాదమే: సాధారణంగా ఒక సీనియర్‌ వ్యక్తి ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తేనే ఆ స్థాయికి చేరుకుంటారు. కానీ, అది మర్చిపోయి తన కింద ఉన్నవారితో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తన ప్రవర్తనతో ఇతరులు బాధపడుతున్నారా అనేది కూడా ఆలోచించరు.
►పక్షపాతంతో పనిచేసే సహోద్యోగి: పై స్థాయిలో ఉన్నవారికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. వారిని పొగుడుతుంటాడు. ఏదైనా నీ కోసం చేస్తాను అంటారు. 
► రాజకీయాలు చేసేవాళ్లు: ఈ వ్యక్తులు తమ కెరీర్‌ను ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. అందుకోసం అధికంగా ఖర్చు పెట్టడానికి కూడా  వెనకాడరు. అబద్ధాలు చెబుతుంటారు. 


అభద్రత పెంచే భయం
నాయకత్వ పాత్రను పోషించాల్సిన సందర్భంలో అభద్రత పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అధికారుల అతిపెద్ద భయం అసమర్థతే అని ఒక సర్వేలో తేలింది. సీనియర్‌ స్థానానికి ప్రమోట్‌ అయినప్పుడు పనితీరుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇది సంభవించవచ్చు. 

కలిసిపోవడానికి ముఖ్యమైనవి
ఎవరితోనైనా ఇట్టే కలిసిపోవడానికి సహాయపడేది ముందుగా మన దృష్టి కోణం. అందుకు ఎదుటివారికి ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటివారి గురించి తప్పుగా అనుకోకూడదు. సహోద్యోగి ఎంత సన్నిహితమైనా మన స్థాయిని మర్చిపోకూడదు. నియంత్రణలపై దృష్టి పెట్టాలి. సహోద్యోగిని మార్చమని పై అధికారులకు చెప్పే బదులు మనం విభిన్నంగా ఏం చేయగలమో వాటిపైన దృష్టి పెట్టాలి. సహోద్యోగులతో నేరుగా పనులు చేసే అవకాశం లేకపోవచ్చు.

ఇలాంటప్పుడు ఇ–మెయిల్‌ వంటి ఇతర మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. ఒకరి దృక్పథాన్ని మరొకరు అర్ధం చేసుకోవాలి. లేదంటే, సహోద్యోగి ప్రవర్తన ఎందుకు అలా ఉంది? వారు సహకరించకపోతే నేను మాత్రమే ఎలా పరిష్కరించగలను? ప్రతిదీ ప్రయత్నించాను.. కానీ, ఇప్పుడు ఎలా? ... ఇలాంటి ప్రశ్నలు కొన్ని సార్లు భయానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. పనిలో కష్టతరమైన సంబంధాలను కొనసాగించడానికి, వ్యక్తుల మధ్య మంచి బంధాలను పెంపొందించడానికి గెటింగ్‌ ఎలాంగ్‌ ఒక మంచి గైడ్‌లా ఉపయోగపడుతుంది. 

టీమ్‌ వర్క్‌
బాస్‌ నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను గుర్తించాలి. సంవత్సరాంతపు లక్ష్యాలను చేధించడం, వర్క్‌పాలసీ గురించి నిరంతరం తెలుసుకోవాలి. ఉద్యోగులపై ఉన్న అభద్రతా భావాలను తొలగించగలగాలి. పనిని ఉమ్మడిగా చేయడానికి ప్రయత్నించాలి. పై అధికారి దగ్గర సాధ్యమైనంతవరకు ‘మేము’ వాక్యాన్నే జోడించాలి. ఉదాహరణకు..‘ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం చేయడానికి ‘మేమంతా’ కష్టపడ్డాం. టీమ్‌గా ఇంకా బాగా కనిపించాలనే మేమంతా కోరుకుంటున్నాం’ అని విజయం సాధించినప్పుడు బాస్‌కు తెలియజేయాలి. పనిలో టీమ్‌ సహకారం ఎంత ఉందో తెలియజేయాలి. 


ఆఫీసులో స్నేహాలు
‘గెటింగ్‌ ఎలాంగ్‌ కోసం నేను న్యూరోసైన్స్, వ్యక్తుల హావభావాలలో చూపించే తెలివి, చర్చలు, మేనేజ్‌మెంట్‌ సైన్స్‌.. వంటి వివిధ అంశాల నుండి విషయ సేకరణ చేశాను. స్నేహితుల బృందాలు ఉంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. సపోర్టివ్‌గా ఉండే సహోద్యోగులతో ఉన్న వ్యక్తులు తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు.

సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటం వల్ల సమాచారం, ఆలోచనలు పంచుకోవడం, ఆత్మవిశ్వాసం, సాధన పెరుగుతాయి. ఇతరులతో సామాజిక సంబంధాలు ఎలా ఉంటున్నాయో కూడా దీని ద్వారా అర్ధమవుతుంది. స్నేహాలు కెరీర్‌కు కూడా మంచివి. స్నేహితులుగా భావించే సహోద్యోగుల బృందాలు, వారి పనితీరుపై చేసే పరిశోధనలో ఎక్కువ ఉత్పాదకత వచ్చింది.        


  – అమీ గలో 

Advertisement
Advertisement