ఈసీ నిర్ణయాన్ని రద్దుచేయండి | Sakshi
Sakshi News home page

ఈసీ నిర్ణయాన్ని రద్దుచేయండి

Published Wed, May 8 2024 4:09 AM

Set aside the decision of the EC

తక్షణమే నిధుల పంపిణీకి ఆదేశాలివ్వండి

హైకోర్టును ఆశ్రయించిన రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు

ఎన్నికల సంఘంవల్ల విద్యాదీవెన నిధుల పంపిణీ ఆగిపోయింది

హైకోర్టును అభ్యర్థించిన సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి

ఈ పథకాలేవీ కొత్తవి కావు.. గతంలో నుంచే అమలుచేస్తున్నాం

ఈ పథకాల కింద నిధుల పంపిణీ ఎంత అవసరమో చెప్పినా ఈసీ ఆపేసింది

హైకోర్టుకు వివరించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌

నిధుల పంపిణీ ఎందుకు అత్యవసరమో చెబుతూ వినతి ఇస్తే పరిశీలించి తగిన నిర్ణయం వెలువరిస్తాం

హైకోర్టుకు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం

మీ నిర్ణయాన్ని మా ముందుంచండి అంటూ సీఈసీకి హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ రేపటికి వాయిదా

సాక్షి, అమరావతి : రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యార్థులకు విద్యాదీవెన, మహిళలకు వైఎస్సార్‌ ‘చేయూత’ నిధులను పంపిణీ చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యాదీవెన, వైఎస్సార్‌ చేయూత నిధుల పంపిణీని వాయిదా వేయాలంటూ ఈసీ ఈ నెల 4న జారీచేసిన లేఖను రద్దుచేయాలని కోరుతూ అనంతపురం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన రైతులు, విద్యార్థులు, ఓ గృహిణి హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. 

విద్యాదీవెన కింద రూ.610.79 కోట్ల నిధులను తక్షణమే పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గుంటూరు, అడవి తక్కెళ్లపాడుకు చెందిన బంకా అరుణ్, పల్నాడు, గుడిపాడుకు చెందిన పఠాన్‌ సూరజ్‌లు ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే, ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రైతులకు ఇవ్వాల్సిన రూ.847.22 కోట్లనూ పంపిణీ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల కమిషన్‌ ఏప్రిల్‌ 30న జారీచేసిన లేఖను సైతం రద్దుచేసి, తక్షణమే ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను పంపిణీ చేసేందుకు ఆదేశాలివ్వాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన యల్లక్కగారి నారాయణ, గాజుల శ్రీనివాసులు మరో వ్యాజ్యం దాఖలు చేశారు.

అంతేకాక.. ‘చేయూత’ నిధులనూ పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ గుంటూరు, భారత్‌పేటకు చెందిన గృహిణి కె. శాంతకుమారి మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మూడింటిపై అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో విచారణ జరపాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, న్యాయవాది వీఆర్‌ రెడ్డి న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ను కోరారు. ఈ అభ్యర్థనను మన్నించిన న్యాయమూర్తి విచారణకు అంగీకరించారు. అనంతరం మ.3 గంటలకు విచారణ చేపట్టారు.

ప్రభుత్వ వినతిని పరిశీలిస్తాం..
ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్‌కు లోబడే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెన పథకం కింద నిధుల పంపిణీని ఎందుకు ఆపామో కారణాలను కూడా తెలియజేశామన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెన నిధుల పంపిణీ విషయంలో ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎందుకు ఆగలేరో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమకు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరిశీలించి తగిన నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టుకు వివరించారు.

 అవసరమైతే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని తెలిపారు. ఇలా.. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, అవినాష్‌ చెప్పిన వివరాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమర్పించే వినతిపై తీసుకున్న నిర్ణయాన్ని తగిన ప్రొసీడింగ్స్‌ ద్వారా కోర్టు ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారం 9వ తేదీ ఉ.10.30కు వాయిదా వేస్తూ జస్టిస్‌ కృష్ణమోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. 

విద్యాదీవెనకూ బ్రేక్‌.. విద్యార్థులు అప్పులబాట
ఇక ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు ఇస్తోందని సీవీ మోహన్‌రెడ్డి వివరించారు. యువతను విద్యాపరంగా ప్రోత్సహించి, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలన్న ఉద్దేశంతో 2019లో ప్రభుత్వం ఈ విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీని కింద మార్చి 1 నాటికి రూ.708 కోట్లను విద్యార్థులు, వారి తల్లుల జాయింట్‌ అకౌంట్లలో జమచేయాల్సి ఉందన్నారు.

 అక్టోబర్, నవంబరు, డిసెంబరు నెలలకు ఈనిధులను చెల్లించాల్సి ఉందన్నారు. ఇందులో కేవలం 97.89 కోట్లు మాత్రమే పంపిణీ చేశారని.. మిగిలిన 610.79 కోట్ల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించిందన్నారు. విద్యాదీవెన నిధులపై ఆధారపడి చదువుకునే విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని మోహన్‌రెడ్డి వివరించారు. సకాలంలో నిధులు అందకపోతే చదువును కొనసాగించేందుకు విద్యార్థులు అప్పులుచేయాల్సి వస్తుందన్నారు. 

ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని నిలిపివేసిన నిధులను తక్షణమే పంపిణీకి ఆదేశాలు జారీచేయాలని ఆయన కోర్టును కోరారు. అలాగే.. వైఎస్సార్‌ చేయూత పథకం కింద నిధుల పంపిణీని కూడా ఈసీ నిలిపేసిన విషయాన్ని మరో న్యాయవాది వీఆర్‌ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోడ్‌ అమల్లోకి రావడానికి ముందునుంచే ఈ పథకం అమలవుతోందన్నారు. ఈసీ నిర్ణయంతో ఎందరో మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

కొత్త పథకాలకే కోడ్‌ వర్తిస్తుంది..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యాదీవెన కొత్త పథకాలు కావని, ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలుచేస్తున్నవేనన్నారు. కరువు మండలాల గుర్తింపు, లబ్ధిదారుల గుర్తింపు ఎప్పుడో జరిగిందన్నారు. మొత్తం 6.95 లక్షల మంది రైతులను గుర్తించామని, అందుకు అవసరమైన మొత్తాలను సైతం సిద్ధంచేశామని ఆయన చెప్పారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఈ పథకాల కింద లబ్ధిదారులకు నిధుల పంపిణీ ఎంత అవసరమో వివరిస్తూ ఈసీకి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. సాధారణంగా కొత్త పథకాలకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందన్నారు. గతంలో ఇంటింటికీ రేషన్‌ సరఫరాను రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకుందని, దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుందన్నారు. ఆ పథకం కొత్త పథకం కాదని, అప్పటికే కొనసాగుతున్న పథకమని హైకోర్టు గుర్తుచేసిందని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదు
పిటిషనర్ల తరఫున మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రకృతి విపత్తుల కారణంగా పంట కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సాయం అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందించే ఇన్‌పుట్‌ సబ్సిడీవల్ల రైతులు కోలుకుని తిరిగి వ్యవసాయ పనులు కొనసాగించుకునేందుకు ఆస్కారం కల్పిస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, అందులో భాగంగానే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తోందన్నారు. 

నిజానికి.. 2023 ఖరీఫ్‌లో కరువువల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.847.22 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. అయితే,  ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో స్క్రీనింగ్‌ కమిటీ ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధుల పంపిణీ కోసం ఈసీ అనుమతి కోరిందన్నారు. కానీ, అందుకు ఈసీ అనుమతిని నిరాకరిస్తూ ఈనెల 30న లేఖ జారీచేసిందన్నారు. నిధుల పంపిణీని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపిందన్నారు. రానున్న సీజన్‌కు విత్తనాలు కొనుగోలు చేసి నాట్లు వేసుకోవాల్సి ఉంటుందని.. అందువల్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీలో ఏదైనా జాప్యం జరిగితే అది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీవీ మోహన్‌రెడ్డి వివరించారు.

 వర్షాలకు ముందే పంట భూములను సిద్ధంచేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిని మధ్యలో ఇలా ఆపేయడంవల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి ఎన్నికల కమిషన్‌ ఆలోచించలేదన్నారు. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్న వారు తీవ్రంగా ప్రభావితమవుతారని తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement