నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ | Nara Lokesh In Amaravati Inner Ring Road Case Applied For Anticipatory Bail - Sakshi
Sakshi News home page

Inner Ring Road Scam Case: నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

Published Wed, Sep 27 2023 1:43 PM

Nara Lokesh In Inner Ring Road Case Applied Anticipatory Bail - Sakshi

సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏ14గా లోకేష్‌ ఉన్న సంగతి తెలిసిందే. 

రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ సర్కార్‌ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదుతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది.  దర్యాప్తులో భాగంగా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది.

అయితే.. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్‌ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్‌ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో జరిగిన స్కామ్‌లో నారా లోకేష్‌ కీలక భూమిక పోషించారని, అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోసం భూములను నారా లోకేష్‌ కొల్లగొట్టినట్లు దర్యాప్తు సంస్థ సీఐడీ నిర్ధారించుకుంది. చంద్రబాబు, నారాయణ, లోకేష్‌తోపాటు  లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లు, అలాగే.. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది ఏపీ సీఐడీ. అయితే నారాయణ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్‌ పొందారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement