‘హోదా’కోసం యువభేరి

‘హోదా’కోసం యువభేరి - Sakshi


తిరుపతిలో నేడు విద్యార్థి సదస్సు

- ‘ప్రత్యేకహోదా, ఉద్యోగావకాశాలు, రాష్ట్రాభివృద్ధి’పై చర్చ

- ముఖ్య అతిథిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

- కీలక ఘట్టానికి చేరుకోనున్న ప్రత్యేకహోదా ఉద్యమం

- తొలిసారిగా హోదాపై గళం విప్పనున్న విద్యార్థిలోకం




సాక్షి, తిరుపతి/ హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా, ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా విద్యార్థిలోకం ఉద్యమానికి సిద్ధమైంది. ప్రత్యేకహోదాతో ఇచ్చే రాయితీలతో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు తరలివస్తారని, భారీ పరిశ్రమలు స్థాపిస్తారని, ఫలితంగా తమకు భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయని విద్యార్థి, నిరుద్యోగ యువత వేయికళ్లతో ఎదురు చూసింది. కానీ విభజన జరిగి ఏడాదిన్నర కావస్తున్నా హోదా ఊసు లేకపోవడం, ఇంటికో ఉద్యోగమిస్తామని అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఒక్క ఖాళీకూడా భర్తీ చేయకపోవడంతో యువతలో ఆగ్రహావేశాలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.



దీంతో ఇప్పటివరకూ ఆందోళనలు, బలిదానాలతో ప్రజలు వ్యక్తంచేసిన ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లేందుకు, ఉద్యమంగా మార్చేందుకు విద్యార్థిలోకం సన్నద్ధమైంది. తమ ఆకాంక్షను బలంగా వినిపించేందుకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు తొలి అడుగు వేస్తున్నారు. ‘ప్రత్యేకహోదా, ఉద్యోగావకాశాలు, రాష్ట్రాభివృద్ధి’ అనే అంశంపై నేడు మంగళవారం తిరుపతిలో సదస్సు నిర్వహించనున్నారు. హోదా వస్తేనే రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతుందనీ, యువతకు ఉద్యోగాలొస్తాయని తొలినుంచీ పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.



స్థానిక పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే ఈ సదస్సులో ప్రత్యేకహోదా ఎలా సాధించుకోవాలన్న అంశంపై జగన్ విద్యార్థులతో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు చెందిన విద్యార్థులు   హాజరయ్యే ఈ సదస్సు వేదికగా ప్రత్యేకహోదా ఉద్యమం ఒక కీలక ఘట్టానికి చేరుకోనుంది. రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేకహోదా, విభజన చట్టంలో ఇచ్చిన రూ.రెండు లక్షల కోట్ల విలువైన అంశాలన్నింటినీ అమలు చేసిన తర్వాతనే ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సదస్సు స్పష్టమైన సందేశం పంపనుంది. ప్యాకేజీ పేరుతో మాయచేసి ప్రత్యేకహోదా అంశాన్ని పక్కదారి పట్టించవద్దని హెచ్చరించనుంది.



ఈ సదస్సుకు అన్నివర్గాలనుంచీ మద్దతు లభిస్తుండటం, వైఎస్ జగన్ పాల్గొననుండటంతో, ఉద్యమం ఊపందుకుంటుందని మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులతో మొదలైన ప్రత్యేక హోదా పోరాటం అన్ని విశ్వవిద్యాలయాలకు పాకుతోందని కలవరపడుతున్న అధికార పార్టీ ఎస్వీయూతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో ప్రభుత్వ ఉలికిపాటు చూస్తుంటేనే అర్థమవుతోంది. ప్రభుత్వం ఎంత నిర్బంధం విధించినా రేపటి తమ భవిష్యత్తుకు ప్రత్యేక హోదా అత్యంత కీలకమని గుర్తించిన యువతీ యువకులు ఈ పోరాటంలో భాగస్వాములు కావడం అధికారపార్టీకి ఏ మాత్రం మింగుడుపడటంలేదు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాటవేత వైఖరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికార బీజేపీ, టీడీపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పూటకోమాటతో ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఐదేళ్లుకాదు, పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ బీజేపీ, హోదా మాతోనే సాధ్యమంటూ టీడీపీ ఎన్నికలకు ముందు ఊరూరా ప్రచారం చేశాయి. పదేళ్లు కాదు పదిహేనేళ్లు హోదా కల్పిస్తామంటూ బీజేపీ నేత వెంకయ్యనాయుడు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేశంగా ప్రసంగాలు చేశారు.


అధికారపీఠం ఎక్కగానే ఆ రెండు పార్టీల బాట, ఆ పార్టీ నేతల మాట మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులున్నాయంటూ వెంకయ్య సన్నాయి నొక్కులు నొక్కుతుంటే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ పాట పాడటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.



ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు హోదా గురించి కేంద్రాన్ని నిలదీస్తే తనకు చిక్కులు వస్తాయన్న భయంతో... తన స్వార్థంకోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒకమాట రాష్ట్రంలో మరోమాట మాట్లాడటం.. హోదా త్వరలోనే వస్తుందని కేంద్ర మంత్రులు చెప్పడం... హోదా వచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఎంపీలే వ్యాఖ్యానిస్తుండడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.


హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రిమండలినుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించి ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదని ప్రశ్నిస్తున్నారు. హోదాను, విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలును విస్మరించి ప్యాకేజీ పేరుతో మాయచేయాలని చూస్తే క్షమించబోమంటూ హెచ్చరిస్తున్నారు.

 

జగన్ అలుపెరుగని పోరాటం....

విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలని వైఎస్సార్‌సీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బీజేపీ, తేవాల్సిన టీడీపీ తమ బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నా వైఎస్సార్‌సీపీ మాత్రం తన పోరుబాటను కొనసాగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పలు దశల్లో ఒత్తిడి తీసుకువస్తూ, హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ తన గళం బలంగా వినిపిస్తూనే ఉన్నారు.


రాష్ట్రపతిని, ప్రధానిని, కేంద్ర మంత్రులనూ ఎప్పటికప్పుడు కలుస్తూ ఒంటరిపోరు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రత్యేకహోదా కోసం అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని, తీర్మానం చేయాలని, కేంద్ర మంత్రిమండలి నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించి ఒత్తిడి తీసుకురావాలని అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు గళమెత్తారు.



కానీ అధికారపక్షం స్పందించకపోవడంతో మంగళగిరిలో సమరదీక్ష చేశారు. విభజన జరిగిన 15 నెలల తర్వాత కూడా ప్రత్యేకహోదాపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఒకరోజు దీక్ష నిర్వహించి రాష్ర్ట ప్రజల గళం వినిపించారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ గట్టిగా పట్టుబట్టడంతో అధికార పార్టీకి విధిలేక ప్రత్యేకహోదాపై తీర్మానానికి అంగీకరించింది. ఆ తర్వాత 15 రోజుల్లోపు హోదాపై స్పష్టమైన ప్రకటన రాకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు సెప్టెంబర్ 26వ తేదీనుంచి ఆయన గుంటూరులో దీక్ష చేయనున్న విషయం తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top