లొంగిపోయిన చిన్నమ్మ

లొంగిపోయిన చిన్నమ్మ


చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు చేరుకున్న శశికళ బృందం

- పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లోని ప్రత్యేక కోర్టుకు హాజరు

- ప్రత్యేక సదుపాయాలకు న్యాయమూర్తి తిరస్కృతి

- అక్కడి నుంచి జైలుకు తరలింపు

- శశి, ఇళవరసిలకు ఒకే గది.. శశికళకు ఖైదీ నెం 9234




సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు కోరిన శశికళ విన్నపాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు చేరుకున్నారు. శశికళతో పాటు ఇదే కేసులో దోషులుగా ఉన్న ఇళవరసి, సుధాకర న్‌లు కూడా వెళ్లారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక కోర్టులో తొలుత లొంగిపోయి అనంతరం వీరు జైలుకు వెళ్లాలి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక కోర్టును పరప్పన అగ్రహార జైలు ఆవరణలో ఏర్పాటు చేశారు.



చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన శశికళ... పూమల్లి, పెరంబదూరు, కాంచీపురం, రాణీపేట, వెల్లూరు, వాణం బాడి, అంబూరు, క్రిష్ణగిరి, హోసూరు మీదుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 5.15 గంటలకు జైలు వద్దకు శశికళ, ఇళవరసిలు ఒకే వాహనంలో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి అశ్వత్థ నారా యణ వారితో ‘మీకు సుప్రీంకోర్టు శిక్ష విధించి న విషయం తెలిసిందా’అని అడిగారు. ఇందు కు వారు ‘తెలుసు, అందుకే ఇక్కడ లొంగిపోవ డానికి వచ్చామ’ని బదులిచ్చారు.



వివరాల నమోదు, సాధారణ వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి అనుమతితో శశికల, ఇళవరసి లు పది నిమిషాల పాటు బంధువు లతో మాట్లాడారు. అనంతరం వారిద్దరినీ జైల్లోని మహిళల బ్యారక్‌లోనికి తీసుకెళ్లారు. సుధాక రన్‌ మాత్రం సాయంత్రం 6.15 గంటలకు కోర్టుకు వచ్చారు. ‘మా కారు డ్రైవరుపై కొంత మంది దాడికి పాల్పడడంతో వేరే మార్గంలో జైలుకు రావాల్సి వచ్చింది’అని ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చారు. కోర్టు ప్రక్రియ ముగిశాక అతన్ని జైల్లోకి తీసుకెళ్లారు. జైలు వద్ద ఎలాంటి అల్లర్లు చోటుచేసు కోకుండా బెంగళూరు పోలీసులు 200 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు.



శశికళ విన్నపం తిరస్కరణ

జైల్లోకి వెళ్లడానికి రెండు వారాల గడువు, ఇంటి నుంచి భోజనం కల్పించాలని శశికళ తన న్యాయవాదుల ద్వారా చేసిన విజ్ఞప్తిని న్యాయ మూర్తి తిరస్కరించారు. ఏ–క్లాస్‌ ఖైదీగా పరిగణించే విషయంలో జైలు ప్రధానాధికారిని సంప్రదించి, పొందవచ్చని సూచించారు. శశికళ గంభీరంగా, చిరునవ్వుతో జైలులోకి వెళ్తూ కనిపించారు. జైలు అధికారులు శశికళకు 9234 నంబర్, ఇళవరసికి 9235, సుధాకరన్‌కు 9236 నంబర్‌ను కేటాయించారు. శశికళ, ఇళవరసిలకు ఒకే గది కేటాయించారు. శశికలకు మూడు నీలిరంగు చీరలు, ఒక ప్లేటు, ఒక చెంబు, ఒక గ్లాసు, ఒక కంబళి, దిండు, దుప్పటిని అందజేశారు. ప్రతి శుక్రవారం మాంసాహారం, పండుగ సందర్భాల్లో ప్రత్యేక భోజనాన్ని అందజేస్తారు. జైలులోని ఇతర ఖైదీలతో కలిసి టీవీ చూడవచ్చు. సాధారణ ఖైదీలతో పాటు వారు జైలులో చేయాల్సిన పనిని (అగరబత్తీలు, క్యాండిల్స్‌ తయారీ, నేతపని తదితరాలు)ఆదివారం కేటాయిం చనున్నారు. ఇందుకు రోజుకు రూ.50 వేతనం లభిస్తుంది.



శశికళ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి

శశికళ నటరాజన్‌ జైలుకు చేరుకునే సమయంలో కొంతమంది ఆందోళనకారులు కాన్వాయ్‌లోని వాహనాలతో పాటు తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న కొన్ని వాహనాలపై దాడికి పాల్పడ్డారు. కేకలు వేస్తూ రాళ్లు చెప్పులతో దాడికి దిగారు. దీంతో ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి, ఆందోళనకారులను చెదర గొట్టారు. కాగా, పన్నీరుసెల్వం మద్దతు దారులే ఈ దాడికి పాల్పడ్డారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు.



చెన్నై జైలుకు బదిలీకి ప్రయత్నాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తమిళనాడులో దాఖలైంది కాబట్టి తమను బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నైలోని పుళల్‌ జైలు లేదా మరేదైనా జైలుకు మార్చేందుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. తమిళనాడుకు తరలింపును కోరుతూ బెంగళూరు కోర్టులో త్వరలో పిటిషన్‌ దాఖలు చేస్తారని తెలుస్తోంది. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ముందుగా తమ అంగీకారాన్ని తెలిపితేనే బెంగళూరు కోర్టు శశికళ పిటిషన్‌ను పరిశీలిస్తుందని నిపుణులు అంటున్నారు. బెంగళూరు కోర్టులో లొంగిపోయినందున కనీసం రెండు నెలలు అగ్రహార జైల్లో గడపాల్సి ఉంటుంది.  



సాధారణ ఖైదీగానే శశికళ  

జైల్లో తనకు వీఐపీ వసతులు కల్పించాలని కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు శశికళ ఒక ఉత్తరం ద్వారా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మినరల్‌ వాటర్, ప్రత్యేకంగా ఎయిర్‌ కండీషన్డ్‌ గది, ఇంట్లో తయారైన భోజనం, వాకింగ్‌ సౌకర్యం కల్పించాలని ఆ ఉత్తరంలో కోరినట్లు సమాచారం. ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి మా త్రమే ఫ్యాన్, వార్తాపత్రికల సరఫరా తదితర సౌకర్యాలు కల్పించేందుకు వీలవు తుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం జైలు జీవితాన్ని ప్రారంభించిన శశికళను అధికారులు సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు తెలిసింది. కోర్టు అనుమతిస్తేనే ఇంటి నుంచి ఆహారం పొందవచ్చని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top