మీ ఆస్తులపై దర్యాప్తునకు సిద్ధమా?

మీ ఆస్తులపై దర్యాప్తునకు సిద్ధమా? - Sakshi


- లోకేష్, చంద్రబాబులకు వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు సవాల్

సాక్షి, హైదరాబాద్: టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ ప్రకటించిన తన ఆస్తులతో పాటు తన తండ్రి చంద్రబాబునాయుడు, తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువపై స్వతంత్ర ఆడిటర్లు లేదా రిటైర్డు న్యాయమూర్తితో దర్యాప్తునకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు సవాల్ విసిరారు.



మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే లోకేష్ ఆస్తుల ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. తమ సవాలును స్వీకరించి దర్యాప్తునకు సిద్ధపడకపోతే లోకేష్ , చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని అనుకోవాల్సి ఉంటుందన్నారు. ‘చంద్రబాబు ఆస్తుల విలువ కేవలం రూ. 42 లక్షలని ప్రకటించారు. అలాంటి వ్యక్తి 1,125 చదరపు గజాల స్థలంలో రాజ సం ఉట్టిపడే రీతిలో ప్యాలెస్ ఎలా నిర్మిస్తున్నారు? ఎవరైనా కట్టిస్తున్నారా? ’ అని రాంబాబు డిమాండ్ చేశారు.

 

చిత్ర విచిత్రాలెన్నో..

లోకేశ్ ప్రకటించిన ఆస్తుల్లో నమ్మడానికి వీల్లేని విచిత్రాలు అనేకం ఉన్నాయన్నారు. లోకేష్‌కు ఆయన తండ్రికి పక్కపక్కనే ఒకరికి 1,125 గజాలు, మరొకరికి 1,285 గజాల స్థలం ఉందని, అలాంటిది చంద్రబాబు స్థలం విలువ రూ. 23.20 లక్షలుగా చూపితే లోకేష్ స్థలం విలువ రూ. 2.36 కోట్లుగా చూపించారని చెప్పారు. నగరం నడిబొడ్డున లోకేష్‌కు, ఆయన తల్లికి పక్కపక్కనే ఐదేసి ఎకరాల భూమి ఉంటే నాయనమ్మ బహుమతిగా ఇచ్చింది కనుక తన భూమి విలువ చెప్పబోనని లోకేష్ అంటున్నారని, పక్కనే ఉన్న తల్లికి చెందిన భూమి విలువను మాత్రం కేవలం రూ. 71.81 లక్షలుగా చూపించారన్నారు.   

 

కరువులోనూ హెరిటేజ్‌కు భలే లాభాలు

రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నపుడే హెరిటేజ్‌కు లాభాలు రావడం మరో విచిత్రమని అంబటి అన్నారు. పాలూ, కూరగాయలమ్మి దేశంలో ఎవరూ వేల కోట్లు సంపాదించింది లేదన్న రాంబాబు.. బహుశా చంద్రబాబు వద్ద గల ఆవులు బంగారు పాలు ఇస్తున్నాయి కనుకే వాటిని అమ్మి ఇంతగా సంపాదిస్తున్నారేమోనని వ్యంగ్య బాణాలు విసిరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top