ఐరాస వేదికగా పాక్‌పై భారత్‌ ఫైర్‌! | Sakshi
Sakshi News home page

ఐరాస వేదికగా పాక్‌పై భారత్‌ ఫైర్‌!

Published Sat, Sep 9 2017 12:22 PM

ఐరాస వేదికగా పాక్‌పై భారత్‌ ఫైర్‌!

సాక్షి, న్యూయార్క్‌: దాయాది పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో ఒక సాధనంగా వాడుకుంటున్నదని భారత్‌ మండిపడింది. ఐక్యరాజ్యసమితిలో 'సాంస్కృతిక శాంతి' అంశంపై జరిగిన జనరల్‌ డిబేట్‌లో పాల్గొన్న భారత్‌.. ఈ సందర్భంగా పొరుగుదేశం తీరును ఎండగట్టింది. ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు పాక్‌ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టింది.

'జమ్మూకశ్మీర్‌ భారత్‌లో సమగ్రభాగం అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా పొరుగుదేశానికి గుర్తుచేస్తున్నాను. ఈ విషయంలో పాక్‌ రాజీకి రావాలి' అని ఐరాసలోని భారత్‌ పర్మనెంట్‌ మిషన్‌ ప్రతినిధి ఎస్‌ శ్రీనివాస్‌ అన్నారు.

సాంస్కృతిక శాంతి అనేది విశాల దృక్పథంలో అంతర్జాతీయ సంబంధాలకు, పొరుగుదేశాల మధ్య సత్సంబంధాలకు, పరస్పర గౌరవానికి ప్రతీక.. కానీ, పాక్‌ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.  ఉగ్రవాదులకు, ఉగ్రవాద గ్రూపులకు స్వర్గధామంగా నిలుస్తూ పాక్‌ భారత భూభాగాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామిక దేశమైన భారత్‌ ఉగ్రవాదులు, అతివాదులకు ఎన్నడూ తలొగ్గదని, గాంధీజీ సూత్రాలైన శాంతి, అహింసలను ముందుకుతీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను భారత్‌ చాటిచెప్తోందన్నారు.

Advertisement
Advertisement