మయన్మార్‌లో సూచీ క్లీన్‌స్వీప్!

మయన్మార్‌లో సూచీ క్లీన్‌స్వీప్! - Sakshi


ఎన్‌ఎల్‌డీకి భారీ మెజారిటీ

 యాంగోన్: మయన్మార్ చారిత్రక ఎన్నికల్లో.. ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలోని ప్రతిపక్ష ఎన్‌ఎల్‌డీ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయం అయిపోయింది. దశాబ్దాల సైనిక పాలనకు చరమగీతం పలికిన మయన్మార్ ప్రజలు సూచీకి ఏకపక్షంగా మెజారిటీ కట్టబెడుతున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల ప్రకారం.. ఎన్‌ఎల్‌డీ అధికారానికి కేవలం మూడు సీట్ల దూరంలో ఉంది. జాతీయ పార్లమెంటు సభలతో పాటు.. రాష్ట్రాల పార్లమెంట్లకు కలిపి 627 సీట్ల ఫలితాలు వెల్లడించగా.. ఎన్‌ఎల్‌డీ 536 సీట్లు (ఎగువ సభలో 83, దిగువ సభలో 243, రాష్ట్రాల్లో 280) గెలుచుకుంది. అధికార ఎన్‌ఎల్‌డీపీకి 51 సీట్లే దక్కాయి. మరోవైపు, మయన్మార్ అధ్యక్షుడు థీన్ సేన్, ఆర్మీ చీఫ్ ఆంగ్ హ్లెయింగ్.. ఫలితాల్లో ఎన్‌ఎల్‌డీ జోరుతో.. సూచీని అభినందించారు.



ప్రజామోదం పొందిన సూచీ విజయానికి అర్హురాలన్నారు. త్వరలో ఏర్పాటుకానున్న ప్రభుత్వానికి సైనికపరంగా పూర్తి సహకారం ఉంటుందని ఆర్మీ చీఫ్ అన్నారు. కాగా, ఫలితాలు ఎన్‌ఎల్‌డీ విజయాన్ని స్పష్టం చేస్తుండటంతో.. ఆర్మీ చీఫ్‌తో, అధ్యక్షుడితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సూచీ ప్రకటించారు. అయితే.. ఫలితాలు పూర్తిగా వెలువడ్డాకే చర్చల ప్రక్రియ మొదలవుతుందని  థీన్ సీన్ తెలిపారు.  1990లో సూచీ పార్టీ ఎన్నికల్లో 59 శాతం సీట్లు గెలుచుకుని విజయం సాధించినా.. మిలటరీ ప్రభుత్వం అధికారాన్ని అప్పగించేందుకు విముఖత చూపడం తెలిసిందే.



 మోదీ, ఒబామా శుభాకాంక్షలు

 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతున్న సూచీకి భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అధికారం చేపట్టాక భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారు. సూచీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా అభినందనలు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top