
చంద్రబాబు అబద్ధాల కోరు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏనాడూ ఓ మాట మీద నిలబడలేదని, ఆయన ఒక పెద్ద అబద్ధాల కోరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు.
టీడీపీ అధినేతపై తలసాని మండిపాటు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వ్యాపార కేంద్రం
డబ్బిస్తే ఎవరి చరిత్రనైనా మార్చేస్తారు
చివరకు పార్టీ ఎంపీనీ వదిలిపెట్టలేదు
ఎన్టీఆర్ కుటుంబసభ్యులను ఒకే దగ్గర ఉండనిచ్చావా?
టీడీపీ ఎమ్మెల్యేల బ్లాక్ మెయిలింగ్ గుట్టును బయట పెడతాం
డబ్బులు ముట్టలేదనే డీఎల్‌ఎఫ్ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలు
సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏనాడూ ఓ మాట మీద నిలబడలేదని, ఆయన ఒక పెద్ద అబద్ధాల కోరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి బ్లాక్‌మెయిల్ చేసే వారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నడుస్తోందని విమర్శించారు. ఇటీవలే టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ఎవరెవరి దగ్గర ఎంతెంత డిమాండ్ చేసి డబ్బు గుంజారో నా దగ్గర జాబితా ఉంది. సమయం వచ్చినప్పుడు బయటపెడతా. చివరకు తమ సొంత పార్టీ ఎంపీని కూడా వదల్లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఓ వ్యాపార కేంద్రం. అక్కడ డబ్బిస్తే చాలు.. ఎవరి చరిత్రనైనా మార్చి రాస్తారు..’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100 మంది బీసీలకు టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పారని.. కానీ ఇచ్చింది 58 మందికేనని తల సాని గుర్తు చేశారు.
సీఎం అభ్యర్థిగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించినప్పుడు టీడీఎల్పీ నేతగా ఆయన ఎందుకు పనికిరాలేదని నిలదీశారు. రాజ్యసభ టికెట్లు ఇవ్వడంలో, ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంలో చంద్రబాబుది అంతా వ్యాపారమేనని ఆరోపించారు. ‘‘బాబుకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు అవకాశం ఇప్పించలేదు..? పార్టీలో సీనియారిటీకి మీరిచ్చిన గుర్తింపు ఏది?..’’ అని తలసాని నిలదీశారు. డబ్బు ముట్టలేదనే ఆరోపణలు..: ఎన్టీఆర్‌కు భారత రత్న వచ్చే వరకు పోరాడతానని చెబుతున్న బాబువి అన్నీ అబద్ధపు మాటలని తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు.
అసలు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒకే వేదికపై ఉండనిచ్చావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘‘ఐకే గుజ్రాల్, దేవెగౌడలను ప్రధానులను చేశానన్నావ్.. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిందే నేను అన్నారు. మరి ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారు?’’ అని తలసాని నిలదీశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇక్కడి రైతులను కొంటున్నారా..? లేదా..? ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రతీ ఎమ్మెల్యే రూ. 5 లక్షలు జమచేశారని చెప్పినదంతా పచ్చి అబద్ధం. పార్టీ ఫండ్ సమకూర్చి ఇక్కడి రైతులను కొంటున్నారు. డీఎల్‌ఎఫ్ భూముల వ్యవహారంలో ఒక ఎమ్మెల్యే భారీగానే డబ్బులు డిమాండ్ చేశారు. అది ముట్టకపోవడంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..’’ అని తలసాని ఆరోపించారు.