ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ భవనాల తొలగింపు

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ భవనాల తొలగింపు - Sakshi


హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని తుమ్మిడికుంట చెరువుకు చెందిన కొంత  భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ భవనాలను యాజమాన్యమే తొలగిస్తోంది. ఈ సెంటర్ ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందినదన్న విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో నిర్మించిన ఈ భవనాల అంశం హైకోర్టు పరిధిలో ఉంది.



 తుమ్మిడికుంట చెరువును ఆనుకుని ఉన్న ఈ భారీ ఫంక్షన్ హాలు చెరువుకు సంబంధించి 25 మీటర్ల మేర ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి తేల్చారు. వాస్తవానికి చెరువు ఫుల్ట్యాంక్ లెవెల్తో పాటు, బఫర్ జోన్గా మరో 30 మీటర్లు కూడా ఉంటుంది. అయితే, చెరువు గట్టునే ఉన్న ఈ సెంటర్ హాలులో 25 మీటర్లు ఫుల్ట్యాంక్ లెవెల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. తమ్మిడి చెరువు ఎఫ్‌టీఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లోని 2 ఎకరాలు ఎన్ కన్వెన్షన్‌లో ఉన్నట్లు  జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.  ఖానామెట్ సర్వేనంబర్ 11/2, 11/36లలో తమ్మిడిచెరువుకు చెందిన స్థలాన్ని చదునుచేసి కన్వెన్షన్  నిర్మాణాలు చేపట్టారని అధికారులు తెలిపారు.



 తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్‌చేస్తూ నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు  స్టే మంజూరు చేసింది. ఆ తరువాత ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్పై చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వానికి తెలిపింది. సర్వే చేసేటట్లయితే ముందస్తుగా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని, ఏ చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. ప్రభుత్వం కూడా చట్టపరంగా నడుచుకోవాలని, చట్టాన్ని అతిక్రమించకూడదని స్పష్టంగా సూచించారు



ఈ నేపధ్యంలో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ భవనాలను యాజమాన్యమే స్వయంగా తొలగించుకుంటుంది. దీంతో ఈ సమస్య సమసిపోయే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top