మత్తు కోసం దగ్గు మందు | Sakshi
Sakshi News home page

మత్తు కోసం దగ్గు మందు

Published Fri, Nov 28 2014 2:12 AM

మత్తు కోసం దగ్గు మందు

  • వైద్యులు సూచించకుండానే కోట్లలో ‘పెన్సిడిల్’ అమ్మకాలు  
  •  దగ్గు కోసం కాకుండా మత్తు కోసం పెరిగిన వాడకం
  •  ప్రొమిథజైన్, కోడిన్, ఎపిడ్రిన్‌లతో కొత్త జబ్బులు
  •  ఔషధ నియంత్రణ లేకపోవడంతో భారీగా అమ్మకాలు
  •  బంగ్లాదేశ్ వంటి విదేశాలకూ భారీగా ఎగుమతులు
  • సాక్షి, హైదరాబాద్: దగ్గుతో బాధపడుతున్న వారికి ఉపశమనం కోసం వైద్యులు సూచించే మందుల్లో ‘పెన్సిడిల్’ అనే మందు ఒకటి. అది కూడా చాలా తక్కువగానే ఈ మందును రోగులకు సూచిస్తారు. కానీ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మందు విక్రయాలు కోట్ల రూపాయల్లో జరుగుతున్నాయి. వైద్యుడు ప్రిస్క్రిప్షన్‌లో రాసిస్తేనే ఈ మందును రోగులకు విక్రయించాలన్న నిబంధనలు ఉన్నా.. డాక్లర్ల చిట్టీలతో సంబంధం లేకుండా.. దగ్గు లేకున్నా.. ఈ మందును కొంటున్న వారి సంఖ్య పెరుగుతోం ది. కారణం.. ఈ పాత మందులో కొత్త మత్తు దొరుకుతుండటమే. పెన్సిడిల్ సిరప్ దగ్గుమందు స్థాయిని దాటుకుని మత్తుమందు స్థాయికి ఎదిగిన తీరు విస్మయపరుస్తోంది. ప్రిస్క్రిప్షన్లు లేకున్నా మందుల షాపులు ఈ సిరప్‌ను విక్రయిస్తున్నాయని.. అయినా ఔషధ నియంత్రణ శాఖ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి...

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దీనికి బానిసలైన వారు లక్షల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఈ మందును ఉత్పత్తి చేయటం లేదు. ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వస్తున్న ఈ మందును దగ్గుకంటే ఎక్కువగా మత్తుకోసం, గాఢ నిద్ర కోసం ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఇందులో మత్తును కలిగించే ప్రొమిథజైన్ హైడ్రోక్లోరైడ్, కోడిన్ ఫాస్పేట్, ఎపిడ్రిన్ హైడ్రోక్లోరైడ్‌లను కలుపుతారు. ఇవి బాగా మత్తు కారకాలు. దగ్గును తగ్గించడం కన్నా గాఢనిద్రకు ఉపక్రమించేలా చేస్తాయి. ఈ కారణంతో ఎక్కువ మంది దగ్గు లేకపోయినా మత్తుకోసం ఈ సిరప్‌ను తీసుకోవడం మొదలెట్టారు. మద్య నిషేధం ఉన్న బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా ఎగుమతి చేస్తున్నారు కూడా. 100 మిల్లీలీటర్ల బాటిల్ ధర రాష్ట్రంలో రూ. 70 గా ఉంటే.. దానిని బంగ్లాదేశ్‌లో రూ. 700 ధరకు విక్రయిస్తున్నట్లు చెప్తున్నారు.
     
    మత్తు మందుకు బానిసలవుతున్న వైనం...

    మోతాదుకు మించితే ఆల్కాహాల్‌కన్నా ప్రమాదకరమైంది పెన్సిడిల్ సిరప్. ఈ మందును రెండేళ్ల లోపు పిల్లలకు, గర్భిణులు, బాలింతల కు ఇవ్వకూడదు. 20 ఏళ్లు దాటిన వారు బాగా పొడిదగ్గుతో బాధపడు తూ, ఊపిరి సలపని పరిస్థితి ఉంటే అదికూడా పెద్దవారు ఒక్కో పూట 5 మిల్లీ లీటర్ల నుంచి 10 మిల్లీ లీటర్ల వరకూ తీసుకోవచ్చు. అదికూడా రోజుకు మూడు సార్లు మాత్రమే. రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. కానీ ఇటీవల పెన్సిడిల్‌కు బానిసైన వారు రోజుకు ఒక బాటిల్ (100 ఎంఎల్) కంటే ఎక్కువ తీసుకుంటున్నట్టు వెల్లడైంది. అదికూడా రోజూ మద్యం సేవించినట్టు అలవాటు పడ్డారు.
     
    అనేక వ్యాధులతో సతమతం...

    పెన్సిడిల్‌కు బానిసలైన లక్షలాది మంది రకరకాల జబ్బులకు గురవుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. పెన్సిడిల్‌లోని ప్రొమిథజైన్ హైడ్రోక్లోరైడ్ వల్ల దీర్ఘనిద్రలోకి వెళ్లడం, సంయమనం కోల్పోవడం, నీరసం, మూత్ర సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, కామెర్లకు గురవుతున్నట్టు తేలింది. కోడిన్ ఫాస్పేట్ కారణంగా నీరసంగా మారడం, రక్తసంబంధిత వ్యాధులు, ఎనీమియా, వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం, తలతిరగడం, మతిమరుపు, హైపర్ టెన్షన్, కాలేయ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఎపిడ్రిన్ వల్ల ఇన్‌సోమ్నియా, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మెదడు సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్ వంటి జబ్బులు సంభవిస్తున్నాయి.
     
    ఆ ఏజెన్సీలు ‘సుధాకర్’ బంధువులవే!
    కామారెడ్డి: ఫెన్సిడిల్ దగ్గు మందును సరిహద్దులు దాటించిన వ్యవహారంలో ఏజెన్సీలు చాలా వరకు ‘అజంతా’ సుధాకర్ బంధువుల వేనని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల, వరంగల్ జిల్లా హన్మకొండతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్‌లోని పలు ఏజెన్సీల నిర్వాహకులు సుధాకర్ బంధువులని సమాచారం. అక్రమ దందాలో సదరు ఏజెన్సీల నిర్వాహకు ల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని విష్ణు ఫార్మా ఏజెన్సీ కామారెడ్డికి చెందిన వ్యాపారులదేనని తెలియవచ్చింది.
     
    మహేందరే ప్రధాన నిందితుడు : దగ్గు మం దును దేశ సరిహద్దులు దాటించిన వ్యవహా రంలో హైదరాబాద్‌కు చెందిన మెడికల్ వ్యా పారి మహేందర్‌ను ప్రధాన నిందితుడిగా ఔష ధ నియంత్రణ అధికారులు గుర్తించారు. కా మారెడ్డికి చెందిన సుధాకర్‌తో పాటు ప్రణీత్ ఫార్మా ఏజెన్సీకి చెందిన చారి, విష్ణు ఫార్మాకు చెందిన సురేందర్ మహేందర్‌కు దగ్గు మందు ను సరఫరా చేశారని విచారణలో నిర్ధారించా రు. కాగా ఇంత మొత్తంలో ఫెన్సిడిల్ సిరప్‌ను రిలీజ్ చేసిన విషయంలో దాన్ని తయారు చేసే అబార్ట్ కంపెనీకి చెందిన అధికారుల పాత్ర ఉండవచ్చనే అనుమానాలున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు కూడా కంపెనీ ప్రతి నిధుల పాత్రపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.
     
    దీనివల్ల తీవ్ర ప్రమాదం
     ‘‘పెన్సిడిల్ మందును మత్తుకోసం వాడుతూండటం చాలా బాధాకరం. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. మందులో ఉండే ఆ మూడు కారకాలు మనిషిని కుంగదీస్తాయి. ఈ మందును ఈ మధ్య కాలంలో ఎవరూ సూచించడం లేదు. ఒకవేళ సూచించినా మోతాదుకు మించి వాడకూడదు. నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.’’
     - డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, ఎండీ ఇంటర్నల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్
     

Advertisement
Advertisement