ఇక అమ్మ ఫొటో కనిపించదా

ఇక అమ్మ ఫొటో కనిపించదా


ప్రభుత్వ పథకాల్లో అమ్మ జయలలిత బొమ్మ  ఇక కనిపించేది అనుమానమే. అక్రమాస్తుల  కేసులో కోర్టు తీర్పు అన్నాడీఎంకే  నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ఖాయం.



సాక్షి, చెన్నై: తమిళుల అమ్మ జయలలిత. అన్నాడీఎంకే వర్గాలు తమ కన్న తల్లి కంటే ఎక్కువగా భావి స్తుంటారు. అమ్మ మీద అభిమానాన్ని ఎక్కువగానే చూపిస్తున్నారు. అన్నాడీఎంకే సర్కారు 2011లో అధికార పగ్గాలు చేపట్టినానంతరం అమ్మ పేరిట పథకాలు కోకొల్లలుగా తెర మీదకు వచ్చాయి. అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, ఇలా పథకాలు ఓ వైపు ఉంటే, మరో వైపు ఉచిత మిక్సీ, గ్రైండర్, ల్యాప్‌టాప్‌లు ఇలా ఉచితాల్లో అమ్మ  బొమ్మ తప్పనిసరి. అమ్మ ఫొటో అన్నది లేని ప్రభుత్వ కార్యాలయాలు ఉండదు. ప్రతి మంత్రి ఛాంబర్‌లోని టేబుల్‌ మీద అమ్మ ఫొటో ఉండాల్సిందే.



ఇది అమ్మ మీదున్న భక్తి. అయితే, ఇప్పుడు ఆ అమ్మ అనంతలోకాలకు చేరారు. అమ్మ ఉన్నప్పుడు భయం, భక్తి రెండు అన్నాడీఎంకే వర్గాల్లో మెండుగానే ఉండేది. ఇప్పుడు అది కరువైంది. అందుకే అన్నాడీఎంకే రెండుగా చీలింది. అధికారం కోసం రెండు శిబిరాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయినా, అమ్మ నినాదాన్నే రెండు శిబిరాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అమ్మ ఆశయ సాధనే లక్ష్యం అని చాటుకుంటూ, ప్రజా మద్దతుకు తీవ్ర కుస్తీలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళతో పాటుగా ముగ్గురు దోషులుగా తేలింది. అలాగే, అమ్మ ఈ లోకంలో లేకున్నా, ఆమె కూడా దోషి అన్న వాదనను కోర్టు తెరమీదకు తెచ్చింది. చట్టాల మేరకు  కేసులో దోషిగా తేలే వారికి ఇక గౌరవం అన్నది కరువే.



ఈ దృష్ట్యా, అమ్మ బొమ్మ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక దర్శనం ఇచ్చేనా, పథకాల్లో అమ్మ ఫొటో , అమ్మ పేరుతో పథకాలు కొనసాగేనా అన్నది అనుమానంగా మారింది. అలాగే, అమ్మ జయలలితకు భారతరత్న దక్కేనా, పార్లమెంట్‌ ఆవరణలో విగ్రహం, తమిళ శాసన సభలో ఫొటో ప్రతిష్టించేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక, మెరీనా తీరంలోని జయలలిత సమాధి పరిసరాలను స్మారక కేంద్రంగా మార్చేందుకు కనీసం ప్రభుత్వం కూడా నిధులు వెచ్చించలేని పరిస్థితి ఈ తీర్పు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. సీఎం పగ్గాల కోసం తీవ్ర కుస్తీలు పడుతున్న పన్నీరు శిబిరం, పళనిస్వామి శిబిరంలో ఎవరు అధికారంలోకి వచ్చినా, వారికి అమ్మ బొమ్మ ఏర్పాటు చిక్కుల్ని తెచ్చే పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, తమ అమ్మ మీదున్న భక్తిని చాటుకునేందుకు చట్ట నిబంధనల్ని ఉల్లంఘించేనా అన్నది వేచి చూడాల్సిందే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top