‘ఆ ఇద్దరు’ అదుర్స్ | Sakshi
Sakshi News home page

‘ఆ ఇద్దరు’ అదుర్స్

Published Thu, Oct 2 2014 1:00 AM

‘ఆ ఇద్దరు’ అదుర్స్

ఇంచియాన్: ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో వరుసగా ఐదోరోజు భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 800 మీటర్ల రేసులో టింటూ లూకా రజతం సాధించగా... మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అదృష్టం కలిసొచ్చి ఉంటే భారత్ ఖాతాలో మరో నాలుగు కాంస్య పతకాలు చేరేవి. పురుషుల 50 కిలోమీటర్ల నడకలో సందీప్... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అశ్విని అకుంజి... పురుషుల 800 మీటర్ల రేసులో సాజిష్ జోసెఫ్, మహిళల 800 మీటర్ల రేసులో సుష్మా దేవి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాలను చేజార్చుకున్నారు.

 ఈసారి మెరుగైన ప్రదర్శన...
 దిగ్గజ అథ్లెట్ పి.టి.ఉష శిష్యురాలైన కేరళ అథ్లెట్ టింటూ లూకా సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని గెల్చుకుంది. 800 మీటర్ల రేసును టింటూ లూకా ఒక నిమిషం 59.19 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 2010 గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో టింటూ కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు మార్గరీటా ముకషెవా (కజకిస్థాన్-1ని:59.02 సెకన్లు) రెండు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ఆసియా క్రీడల రికార్డును బద్దలుకొట్టి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మార్గరీటా దూకుడుకు 1ని:59.85 సెకన్లతో 1994 హిరోషిమా క్రీడల్లో కూ యున్‌జియా (చైనా) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. జింగ్ జావో (చైనా-1ని:59.48 సెకన్లు) కాంస్యం నెగ్గగా... భారత అథ్లెట్ సుష్మా దేవి (2ని:01.92 సెకన్లు) నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

 16 ఏళ్ల తర్వాత...
 ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రోలో 16 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ పతకం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అన్నూ రాణి జావెలిన్‌ను 59.53 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించింది. చివరిసారి 1998 బ్యాంకాక్ క్రీడల్లో గుర్మీత్ కౌర్ భారత్‌కు జావెలిన్ త్రోలో కాంస్యాన్ని అందించింది. మొత్తం ఆరు రౌండ్‌లపాటు జరిగిన ఫైనల్లో అన్నూ రాణి తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 59.53 మీటర్ల దూరం విసిరింది. మూడు రౌండ్‌లు ముగిసేవరకు అన్నూ రాణినే ఆధిక్యంలో ఉండటం విశేషం. తర్వాతి మూడు రౌండ్లలో చైనా క్రీడాకారిణులు జాంగ్ లీ (చైనా-65.47 మీటర్లు), లింగ్‌వీ లీ (చైనా-61.43 మీటర్లు) రాణించి వరుసగా స్వర్ణ, రజత పతకాలను దక్కించుకున్నారు.

 అశ్వినికి నిరాశ
 మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అశ్విని అకుంజికి నిరాశ ఎదురైంది. అశ్విని 57.52 సెకన్లలో రేసును పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల ఫైనల్లో సాజిష్ జోసెఫ్ ఒక నిమిషం 49.59 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆరుగురు  పాల్గొన్న పురుషుల 50 కిలోమీటర్ల నడకలో భారత అథ్లెట్లు సందీప్ కుమార్ (3గం:59ని.31 సెకన్లు) నాలుగో స్థానంలో, బసంత బహదూర్ రాణా (4గం:07ని.06 సెకన్లు) ఐదో స్థానంలో నిలిచారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో భారత అథ్లెట్ జితిన్ పాల్ ‘ఫాల్స్ స్టార్ట్’ చేయడంతో అతనిపై అనర్హత వేటు పడింది.


 
 భారత అథ్లెట్లు, మహిళల 800 మీటర్ల రేసు, మహిళల జావెలిన్ త్రో, Indian athletes, the women's 800-meter race, the women's javelin throw
 

Advertisement
Advertisement