గంగూలీ X శాస్త్రీ | Sakshi
Sakshi News home page

గంగూలీ X శాస్త్రీ

Published Wed, Jun 29 2016 12:20 AM

గంగూలీ X శాస్త్రీ

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపికై దాదాపు వారం కావస్తోంది. కానీ అవకాశం కోల్పోయిన రవిశాస్త్రి మాత్రం తన అసంతృప్తిని దాచుకోలేకపోతున్నాడు. చివరి వరకు ఖాయం అనుకున్న కోచ్ పదవి చేజారడం శాస్త్రిని తీవ్ర అసహనానికి గురి చేసింది. విదేశాలనుంచి తిరిగొచ్చిన తర్వాత నేను మాట్లాడనంటూనే గంగూలీపై అసహనాన్ని ప్రదర్శించడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ ఇద్దరు మాజీల మధ్య అన్ని విభేదాలు ఉన్నాయా...  అదే కోచ్ ఎంపికపై ప్రభావం చూపించిందా!
 
‘కోచ్ ఎంపిక, ఇంటర్వ్యూ ప్రక్రియ అనేది పూర్తిగా రహస్య అంశం. అది ఎవరి ముందూ బయట పెట్టేది కాదు. శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై నేనేమీ స్పందించను. అడ్వైజరీ కమిటీలో ఉన్న మిగతా ఇద్దరినీ కూడా మీరు అడగవచ్చు కదా’              
- సౌరవ్ గంగూలీ

 
‘నాతో సౌరవ్‌కు ఏం సమస్య ఉందో అతడినే అడగండి. ఇక ముందు ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఎంపిక సమయంలో అక్కడ ఉండాలని గంగూలీకి సలహా ఇస్తా. అప్పుడు బాధ పడ్డ మాట వాస్తవమే. ఇప్పుడు నేను కోచ్ గురించి మరిచిపోయా. ’                          
- రవిశాస్త్రి

 
బయటపడ్డ పాత విభేదాలు  
కుంబ్లేను తెరపైకి తెచ్చిన సౌరవ్  
అసంతృప్తిని బయటపెట్టిన రవిశాస్త్రి

సాక్షి క్రీడా విభాగం: ‘నేను ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో సౌరవ్ గంగూలీ అక్కడ లేడు’... కోచ్ అవకాశం కోల్పోయిన తర్వాత రవిశాస్త్రి మీడియా ముందు బయటపెట్టిన విషయమిది. కుంబ్లే పేరును ప్రకటించే వరకు అంతా పారదర్శకంగానే జరిగిందని భావిస్తూ వచ్చినవారికి ఇలా కొత్త విషయం తెలిసింది. సెలక్షన్ కమిటీలో ఉన్నదే నలుగురు. వారిలో విదేశాల్లో ఉన్న సచిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వచ్చాడు.

కోచ్ రేసులో ప్రధానంగా పోటీలో ఉన్నది శాస్త్రి, కుంబ్లే మాత్రమే. కనీసం ఈ ఇద్దరిని కూడా మొత్తం కమిటీ కూర్చొని ఇంటర్వ్యూ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కుంబ్లేను మాత్రం సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసి, సరిగ్గా శాస్త్రి వచ్చే సమయంలో గంగూలీ వెళ్లిపోవడం చూస్తే ఇది కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది.
 
కీలక సమయంలో...
ఇంటర్వ్యూ చేయాల్సిన సమయంలో గంగూలీ వెళ్లింది తన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సమావేశానికి. శాస్త్రి లైన్‌లోకి వచ్చిన సమయంలో సరిగ్గా గంట పాటు సమావేశానికి వెళ్లిన సౌరవ్, మరో అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. భారత కోచ్‌లాంటి కీలక ఎంపిక సమయంలో ఎంత అధ్యక్షుడైనా ఒక రాష్ట్ర సంఘం సమావేశానికి వెళ్లటం అర్థరహితం. తను తలచుకుంటే నచ్చిన సమయంలో ఆ సమావేశం ఏర్పాటు చేసుకోగలడు. కానీ సౌరవ్ మనసులో మరో ఆలోచన ఉండటం వల్లే అతను తప్పుకున్నాడు. రవిశాస్త్రి విమర్శించినట్లు... ‘గంగూలీ ఇంటర్వ్యూకు వచ్చిన వ్యక్తిని అవమానించడమే కాదు, తన బాధ్యతను కూడా విస్మరించాడు’.
 
ఇద్దరికీ పడదా...
రవిశాస్త్రి, గంగూలీ కలిసి ఏనాడూ ఆడలేదు. సరిగ్గా చెప్పాలంటే 1992లో బ్రిస్బేన్ వన్డేలో గాయం కారణంగా చివరి నిమిషంలో రవిశాస్త్రి తప్పుకోవడంతో గంగూలీకి కెరీర్ తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ ఆటగాళ్లుగా పరస్పర మర్యాద తప్ప ఏ దశలోనూ కలిసి పని చేయలేదు కూడా. కాబట్టి వ్యక్తిగత విభేదాలు, ఇగోల వంటి సమస్య కూడా లేదు. అయితే బీసీసీఐ వర్గాలు చెప్పినదాని ప్రకారం గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కామెంటేటర్‌గా శాస్త్రి నిత్య విమర్శకుడి పాత్ర పోషించాడు.

ఏనాడూ సౌరవ్‌కు కనీస మద్దతు పలకలేదు. పైగా అతనికి వ్యతిరేక ప్రచారం జరిపే ఒక వర్గం పక్షం వహించాడు. ఇది సౌరవ్ మనసులో పెట్టుకున్నాడనేది ఒక వాదన. అయితే ఇటీవల చాలా సందర్భాల్లో శాస్త్రి పనితీరును సౌరవ్ బహిరంగంగానే అభినందించిన విషయం మరచిపోకూడదు. కానీ కుంబ్లే ప్రజెంటేషన్ తర్వాత శాస్త్రిని కూడా ఇంటర్వ్యూ చేయడం కనీస బాధ్యత.
 
ఇదేం పారదర్శకత?
శాస్త్రి, గంగూలీ మధ్య విభేదాల గురించి బోర్డుకు నిజంగా తెలిసి ఉంటే కోచ్ ఎంపిక కమిటీలో అతడిని ఉంచడమే సరైంది కాదు. లేదా మరో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని, దరఖాస్తు చేయకపోవడమే మంచిదని శాస్త్రికి ముందే సూచించి ఉండాల్సింది. కేవలం పారదర్శకత అంటూ చూపించడం కోసం దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్వ్యూల హడావిడి, చివరకు జాబితాలో లేని వ్యక్తికి పట్టం కట్టడంలో బోర్డు వ్యవహారశైలి సరిగా లేదు. అయితే ఈ అంశంలో శాస్త్రితో విభేదాలకంటే కుంబ్లేపై ఉన్న అభిమానమే కీలక పాత్ర పోషించిందని బోర్డు సభ్యుడొకరు  అన్నారు. మొత్తంగా ‘దాదాగిరి’తోనే కోచ్ ఎంపిక జరిగినట్లు అర్థమవుతోంది.
 
చివరి వరకూ రేసులో మూడీ!
భారత కోచ్ ఎంపిక సమయంలో అందరూ భావిస్తున్నట్లు కుంబ్లేకు, రవిశాస్త్రికి మధ్య పోటీ సాగలేదు. ఇంటర్వ్యూలు ముగిశాక అనవసరం అంటూ ముందుగా తొలగించిన జాబితాలోనే రవిశాస్త్రి పేరు ఉంది! చివర్లో కుంబ్లే, టామ్ మూడీ మధ్యనే రేసు కొనసాగింది. ప్రజెంటేషన్, అనుభవం చూసుకుంటే మూడీనే ఒకడుగు ముందున్నాడు. ఈ సమయంలో టెస్టు కెప్టెన్ కోహ్లి అభిప్రాయం తీసుకున్నారు. అతను కుంబ్లేకే ఓటు వేయడంతో ఎంపిక ఖాయమైంది. మరో వైపు బ్యాటింగ్ కోచ్ పదవి కోసం  కమిటీ రవిశాస్త్రి పేరును ప్రతిపాదించిందని, అయితే ఇది మీ పని కాదంటూ తాను మధ్యలోనే అడ్డుకున్నట్లు బోర్డు కార్యదర్శి షిర్కే చెప్పడం విశేషం. సహాయక సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రధాన కోచ్‌కు ఉండాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement