స్వర్ణానికి ఒక అడుగుదూరంలో.. | Sakshi
Sakshi News home page

స్వర్ణానికి ఒక అడుగుదూరంలో..

Published Tue, Sep 30 2014 3:02 PM

స్వర్ణానికి ఒక అడుగుదూరంలో..

ఇంచియాన్:భారత పురుషుల హాకీ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. హాకీ పూర్వ వైభవాన్ని తిరిగి నిలబెట్టేందుకు భారత్ ఒక అడుగుదూరంలో నిలిచింది. 17 వ ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ దక్షిణకొరియాతో జరిగిన పురుషుల హాకీ సెమీ షైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఫైనల్ కు చేరింది. మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 1-0 తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆసియా గేమ్స్ లో ఆద్యంత ఆకట్టుకున్నభారత్ జట్టు పటిష్టమైన దక్షిణకొరియాను బోల్తా కొట్టించింది. ఆట 44 వ నిమిషంలో ఆకాశ్ దీప్ సింగ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

 

అనంతరం దక్షిణకొరియాను గోల్ చేయకుండా నిలువరించిన భారత్ జట్టు విజయాన్ని కైవసం చేసుకుని 12 ఏళ్ల తరువాత ఫైనల్ ఆశలను నెరవేర్చుకుంది. గతంలో 2002లో ఫైనల్ కు చేరిన భారత్.. ఆ తరువాత సెమీస్ అడ్డంకిని దాటలేకపోయింది. ఇదిలా ఉండగా భారత్ పురుషలు హాకీలో స్వర్ణం సాధించి 16 ఏళ్ల దాటింది. 1998 లో ధనరాజ్ పిళ్లె కెప్టెన్సీలో స్వర్ణం సాధించిన భారత్ ఆ తరువాత ఆ పతకాన్ని దక్కించుకోలేదు. పాకిస్తాన్-మలేషియాల మధ్య జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజేతతో భారత్ తుదిపోరులో తలపడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరి అక్కడ కూడా విజయం సాధిస్తే.. 2016 రియో ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధిస్త్తోంది.ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడినా భారత్ కు రజత పతకం దక్కుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement