పోరాడి ఓడిన సన్ రైజర్స్ | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సన్ రైజర్స్

Published Sat, Apr 18 2015 7:31 PM

పోరాడి ఓడిన సన్ రైజర్స్

విశాఖపట్నం: ఐపీఎల్-8లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. హోంగ్రౌండ్లో మళ్లీ పరాజయం తప్పలేదు. శనివారం విశాఖ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 4 పరుగులతో ఢిల్లీ డేర్డెవిల్స్ చేతిలో పోరాడిఓడిపోయింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ పూర్తి ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. బొపారా 41, వార్నర్ 28, రాహుల్ 24, కరణ్ 19, ధావన్ 18, ఆశీష్ రెడ్డి 15 పరుగులు చేశారు. డుమినీ 4 కీలక వికెట్లు పడగొట్టాడు.

హైదరాబాద్ విజయం అంచుల వరకూ వెళ్లింది. విజయానికి ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా, చేతిలో 4 వికెట్లున్నాయి. ఈ దశలో ఆశీష్ రెడ్డి అవుట్ కావడం ప్రతికూలంగా మారింది. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సివుండగా, కరణ్ శర్మ భారీ షాట్కు ప్రయత్నించి క్యాచవుటయ్యాడు. దీంతో హైదరాబాద్కు నిరాశ తప్పలేదు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్ (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60), డుమినీ (41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అయ్యర్, డుమినీ రెండో వికెట్కు 78 పరుగులు జోడించారు. చివర్లో కేదార్ జాదవ్ (19 నాటౌట్), మాథ్యూస్ (15 నాటౌట్) దూకుడుగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లు ప్రవీణ్ కుమార్, స్టెయిన్, భువనేశ్వర్, ఆశీష్ రెడ్డి తలా వికెట్ తీశారు. హైదరాబాద్ బౌలర్లలో భువి (1/21) పొదుపుగా బౌలింగ్ చేశాడు.

Advertisement
Advertisement