బిషన్‌సింగ్‌, చేతన్‌ చౌహాన్‌లపై గౌతీ ఫైర్‌.. | Sakshi
Sakshi News home page

బిషన్‌సింగ్‌, చేతన్‌ చౌహాన్‌లపై గౌతీ ఫైర్‌..

Published Wed, Jun 13 2018 1:10 AM

Gambhir lashes out at Chauhan, Bedi after outsider Saini India call-up - Sakshi

న్యూఢిల్లీ : ఆటగాడిగా గౌతమ్‌ గంభీర్‌ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతని మాటల్లో కూడా అంతే పదును కనిపిస్తుంది. ఇక తాను అండగా నిలిచిన ఒక ఆటగాడి రాష్ట్రం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అతను ఊరుకుంటాడా! తాజాగా అతని మాటలు దీనిని మరోసారి నిరూపించాయి. అఫ్గానిస్తాన్‌తో టెస్టు కోసం ఢిల్లీ పేసర్‌ నవదీప్‌ సైని భారత జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. హరియాణాలోని కర్నాల్‌లో పుట్టిన సైని రంజీల్లో ఢిల్లీ తరఫునే ఆడినా... దిగువ స్థాయి క్రికెట్‌లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. అతడు ‘బయటి వ్యక్తి’ అంటూ గతంలో బిషన్‌సింగ్‌ బేడి, చేతన్‌ చౌహాన్‌  విమర్శించారు. సైనిని ఢిల్లీకి ఆడించడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌పై కూడా వ్యతిరేకత కనబర్చారు.

తాజాగా సైని ఎంపికను నిరసిస్తూ ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధికారులు కరపత్రాలు పంచడంతో పాటు నల్ల బ్యాండ్‌లు ధరించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌ స్పందించాడు. ‘బయటి వ్యక్తి సైని భారత జట్టుకు ఎంపిక కావడంపై ఢిల్లీ సభ్యులు బేడి, చౌహాన్‌లకు నా సానుభూతి. నల్ల బ్యాండ్‌లు బెంగళూరులో కూడా ఒక్కో రోల్‌కు రూ. 225 చొప్పున లభిస్తున్నాయని నాకు తెలిసింది. సైని ముందుగా భారతీయుడు, ఆ తర్వాతే అతని రాష్ట్రం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను’ అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement