పాల కేంద్రాలే పచ్చ ఏటీఎంలు | Sakshi
Sakshi News home page

పాల కేంద్రాలే పచ్చ ఏటీఎంలు

Published Wed, Mar 27 2019 1:32 PM

TDP Leaders Money Distribution With Milk Dairy Employees - Sakshi

వారంతా ఒక సంస్థ ఉద్యోగులు.. తమకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఓ రాజకీయ పార్టీకి కార్యకర్తలుగా వెట్టిచాకిరీ చేస్తున్నారు.పోలింగ్‌ వరకు డెయిరీ విధులు పక్కన పెట్టి.. ప్రచార కార్యక్రమాలు భుజానికెత్తుకోవాలని ఆ సంస్థ యాజమాన్యం హుకుం జారీ చేయడంతో వారికి వేరే గత్యంతరం లేకపోయింది.ఆ సంస్థే విజయ విశాఖ డెయిరీ.. చైర్మన్‌గిరీతోపాటు పలు కీలక పదవులను తన ఇంటి గుమ్మంలో కట్టేసుకున్న టీడీపీ నేత ఆడారి తులసీరావు.. ఈ సారి ఎన్నికల్లో తన కుమారుడు ఆనంద్‌కు టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఇప్పించుకున్నారు.అదిగో.. అప్పట్నుంచే డెయిరీ ఉద్యోగులు ఏటీఆర్‌ ఆర్మీగా మారిపోయారు.. పాలసేకరణ కేంద్రాలు నగదు పంచే ఏటీఎం కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. ఉత్తరాంధ్రతోపాటు గోదావరి జిల్లాల్లోనూ తనకున్న నెట్‌వర్క్‌ను ఎన్నికల్లో దుర్వినియోగం చేసేందుకు ఆడారి కుటుంబం స్కెచ్‌ వేసింది. ఆ ప్రణాళిక అమలవుతున్న తీరు ఓసారి పరికిద్దాం రండి..

విశాఖపట్నం, పెందుర్తి: రైతుల సంక్షేమం కోసమే డెయిరీ నడుపుతున్నాం. లాభాల్లో అధిక మొత్తం వారికే బోనస్‌గా అందిస్తున్నాం. వారి సంక్షేమమే మా ధ్యేయం’.. అని నీతి వాక్యాలు వల్లిస్తూ ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ సుదీర్ఘకాలంగా విశాఖ డెయిరీని ఏలుతున్న ఆడారి తులసీరావు అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడు ఆనంద్‌ విజయం కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పాలసేకరణ కేంద్రాలను ఏటీఎం(ఆడారి ట్రాన్స్‌ఫర్‌ మనీ) కేంద్రాలుగా మార్చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. డెయిరీ ఉద్యోగులే పర్యవేక్షకులుగా.. పాల కేంద్రాల సిబ్బందితో ఏటీఆర్‌ ఆర్మీ పేరిట బృందాలను ఏర్పాటు చేశారు. వారితో పగలంతా ప్రచారం చేయించుకుని.. పొద్దుపోయాక ఓటర్లకు పంపిణీ కార్యక్రమాలు చేపట్టాని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందుకోసం ఇప్పటికే పాల కేంద్రాలకు గుట్టుచప్పుడు కాకుండా నగదు మూటలు చేరవేసినట్లు సమాచారం. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని టీడీపీ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాలకు పచ్చ జెండాలు మోసిన డెయిరీ సిబ్బంది పంపిణీ కార్యక్రమాల్లోనూ కీలకపాత్ర పోషించనున్నారు.

అలా అయితేనే పంపిణీ సులభమని..
‘మా సార్‌ కొడుకు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ 20 రోజులు డెయిరీ పని పక్కన పెట్టి ఎన్నికల పనే చూడమన్నారు. ఆనంద్‌ సార్‌ గెలవగానే మాకు జీతాలు పెంచుతామన్నారు. పోలింగ్‌ వరకు పార్టీ జెండా మా భుజాన ఉండాల్సిందే. పాల సేకరణ కేంద్రాల నుంచే డబ్బుల పంపిణీకి అంతా సిద్దం చేశారు’.. అని జిల్లా నుంచి నగరానికి పనిమీద వచ్చిన ఓ డెయిరీ ఉద్యోగి తన స్నేహితుడితో చెప్పడం ఆ నోటా ఈ నోటా ప్రచారంలోకి వచ్చింది. ఈ మాటలే ఆడారివారి ప్రణాళికను బట్టబయలు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ డెయిరీకి పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. పాల వ్యాన్ల ద్వారా ఆ కేంద్రాలకు నగదు చేరవేస్తే ఓటర్లకు పంపిణీ చేయడం సులభమనేది టీడీపీ నేతల ఎత్తుగడ. దీనికి తోడు ఎన్నికలకు ముందే ఉగాది పండుగ ఉంది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని పండుగ బోనస్‌ పేరిట ఏప్రిల్‌ మొదటివారంలో నగదు పంపిణి చేయాలని ఆడారి సైన్యం ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే అభ్యర్థులకూ సాయం
మరోవైపు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆనంద్‌ తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఈ ‘ఏటీఎం’ల సాయం అందిస్తామని మాటిచ్చారట!. ఈ మేరకు ఎంపీ ‘సాయం’తో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలకు పంపిణీ చేయనున్న నగదును డెయిరీ కేంద్రాలకు చేరవేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి డబ్బు ఎప్పుడు పంపిణీ చేయాలి.. ఎలా చేయాలి అన్నదానిపై కసరత్తు చేశారని అంటున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement