ముగ్గురిని ఓడించి..   | Sakshi
Sakshi News home page

ముగ్గురిని ఓడించి..  

Published Wed, Apr 3 2019 12:37 PM

Sandra Venkata Veeraiah Political Story - Sakshi

సత్తుపల్లి: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు’ఉండరనే నానుడి నిరూపితమవుతోంది. సత్తుపల్లిలో ఒకప్పటి ప్రత్యర్థులు నేడు మిత్రులుగా మారి కలిసి వ్యూహాలు రచిస్తూ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్, పిడమర్తి రవిలతో అసెంబ్లీ ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడి విజయం సాధించారు. ప్రతీ ఎన్నికల్లో ఎవరో ఒకరితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రత్యర్థులుగా ఉన్న సంభాని చంద్రశేఖర్, డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్, పిడమర్తి రవిలతో వివిధ సందర్భాల్లో ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్‌ అయినప్పటి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య గెలుపొందటం విశేషం.

ఐదుసార్లు తలపడిన సంభానితోనే కలిసి..  
మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో సండ్ర వెంకటవీరయ్య ఐదు సార్లు తలపడ్డారు. 1994 లో తొలిసారిగా పాలేరులో సీపీఎం నుంచి బరిలో దిగిన సండ్ర.. సంభాని చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. తర్వాత రెండుసార్లు పరాజయం పాలైనా.. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 2009, 2014లో సంభానిపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సంభాని చంద్రశేఖర్‌తో కలిసి పని చేసి సండ్ర వెంకటవీరయ్య భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఐదుసార్లు హోరాహోరీగా తలపడిన చంద్రశేఖర్‌తో ఆరోసారి కలిసి పనిచేయటం, ఆ ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్‌ తన ఎన్నికల తరహాలోనే పని చేయటం రాజకీయ వర్గాలలో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

2014 ఎన్నికల్లో.. 
2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఖమ్మంజిల్లాలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభజనం బలంగా ఉంది. ఫ్యాన్‌ గాలిని తట్టుకొని 2,485 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సంభాని చంద్రశేఖర్‌ మూడో స్థానం, పిడమర్తి రవి నాలుగో స్థానం దక్కించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కోసం మట్టా దయానంద్‌ అలుపెరగని పోరు జరిపినా అవకాశం లభించలేదు. దీంతో ఆ ఎన్నికల్లో దయానంద్‌ పోటీ చేయలేదు. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం మట్టా దయానంద్‌తో కలిసి వ్యూహరచనలు చేస్తున్నారు.
 
2018 ఎన్నికల్లో... 
2018 ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవిపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ సండ్ర వెంకటవీరయ్య విజయం కోసం శ్రమించారు. రాష్ట్రం మొత్తం టీఆర్‌ఎస్‌ ప్రభంజనం వీచినా.. సత్తుపల్లిలో 19వేల ఓట్లతో సండ్ర వెంకటవీరయ్య గెలవటం రాజకీయాల్లో చర్చానీయాంశమైంది. మారిన రాజకీయ పరిణామాలలో సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతానని ప్రకటించారు. ఇప్పుడు పిడమర్తి రవితో కలిసి రాజకీయంగా పని చేయాల్సి వస్తోంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement