మాఫీ కాదు రైతుకు టోపీ

మాఫీ కాదు రైతుకు టోపీ - Sakshi


దౌర్భాగ్యమేమంటే... ముఖ్యమంత్రితో సహా అందరూ రుణాలను మాఫీ చేశామంటూ గడిచిన వారం రోజులుగా పండుగలు కూడా చేసుకుంటున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నీ కలిపి రూ. లక్ష కోట్లకు పైగా ఉండగా, రూ. 30 నుంచి 35 వేల కోట్ల మేర మాఫీ చేస్తున్నట్టు చెప్పడంలో ఆంతర్యమేంటి? ఇదే అడుగుతూ రైతులు రోడ్డెక్కారు.

 

అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాట్లు పడాల్సిన సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక పాట్లు పడుతున్నారు. జూన్ తొలి రెండు వారాల్లో పలకరించాల్సిన తొలకరి జాడలేక ఆందోళన కలిగిస్తుంటే తీసుకున్న అప్పులు కట్టమంటూ బ్యాంకుల నుంచి అందుతున్న డిమాండ్ నోటీసులతో ఆంధ్రప్రదేశ్ రైతాంగం బెంబేలెత్తిపోతోంది.  రెండో పంట సంగతి దేవుడెరుగు... తొలి పంటకే ఇంతటి దారుణమైన సంక్లిష్ట పరిస్థితి తలెత్తింది. నారు మళ్లకు నీరొస్తుందా? గతేడాది చేసిన అప్పులకు పూచీ ఎవరు? అసలు రుణాలు మాఫీ అవుతాయా? సకాలంలో చెల్లించని కారణంగా చేసిన అప్పులకు పెరిగిన వడ్డీ భారం సంగతేంటి? ఇప్పుడు పెట్టుబడికి డబ్బులెక్కడినుంచి వస్తాయి? ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుని సంక్షోభంలో పడాల్సిందేనా? ఇట్లాంటి ఎన్నో సమస్యలకు సమాధానాలు లేక రైతాంగం ఇప్పుడు రోడ్డెక్కుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు రైతన్నలు, పొదుపు సంఘాల మహిళలు రోడ్డెక్కారు. ఇలా అన్నదాతలు, అక్కచెల్లెళ్లు రోడ్డెక్కితే అధికార పార్టీ మాత్రం అవహేళన చేసింది. నిజంగానే రైతులకు మేలు చేసి ఉంటే ఈరోజు రైతన్న రోడ్డెక్కే పరిస్థితి వచ్చేదా? రైతన్నల దైన్యస్థితి అధికార పక్షానికి కనిపించడం లేదా? అధికార పక్షం సంబరాలు చేసుకుంటున్నట్టుగానే నిజంగానే రైతులకు రుణ మాఫీ అయిందా? ఆత్మవిమర్శకన్నా ప్రత్యర్థులపై విమర్శలకు దిగడంలోని ఆంతర్యమేంటి? రైతులకు ఒరిగిందేంటో ఎందుకు చెప్పలేకపోతున్నారు?



ఇప్పుడు పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆలస్యంగా వచ్చిన వర్షాలతోనైనా దుక్కి దున్నాలను కుంటున్న రైతు ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. గతంలో ఏ సీజన్‌లోనూ ఎదుర్కొనని ఒక విచిత్రమైన పరిస్థితిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదుర్కొంటున్నారు. పట్టుమని పది ఊళ్లలో కూడా నారుమళ్ల జాడ కనిపించని దారుణమైన పరిస్థితి కనబడుతోంది. వర్షాల జాడ లేక రాయలసీమ రైతాంగం అతలాకుతలమైంది. అక్కడ కరువు ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. వెరసి... భవిష్యత్తేమిటో తెలియక అయోమయానికి గురవుతున్న రైతులు ఇప్పుడు ఆందోళన బాటపడుతున్నారు. అన్నీ సవ్యంగా సాగితే ఈపాటికే దుక్కి దున్ని పొలం పనుల్లో నిమగ్నం కావలసిన రైతు రోడ్డు బాటను పట్టడానికి... రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడానికి ప్రభుత్వ నిర్వాకమే ప్రధాన కారణంగా మారింది. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే పాలకులు అధికారమే పరమావధిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో దోబూచులాడటం ఇప్పుడు రైతాంగానికి ప్రాణసంకటంగా మారింది.



మేనిఫెస్టో అంటే మాయమాటల ప్రణాళికా?



అధికారంలోకి వస్తే రైతులు, పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. ఎన్నికల సభల్లో దీన్నే ప్రధానంగా ప్రచారం చేశారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రధాన హామీగా చెప్పారు. రాష్ట్రాన్ని రెండుగా విడదీస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించి, జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయని కేంద్రం అధికారికంగా (జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించారు) ప్రకటించింది. ఎన్నికల వేడి అందుకోకముందే ఈ ప్రకటన వెలువడింది. తాను ‘మీకోసం’ పేరుతో పాదయాత్ర చేసినప్పుడు రైతుల బాధలను ప్రత్యక్షంగా చూసినందున వారికి ఉపశమనం కలిగించడానికి వారి రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఆ తర్వాత దాదాపు రెండేళ్లుగా ఆ మాట చెబుతున్నారు. దానిపైనే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన వేరువేరుగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. రెండింటిలోనూ రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు చెబుతున్న ఆంక్షలు, నిబంధనలు, పరిమితుల ప్రస్తావన గురించి దాంట్లో ఒక ముక్క కూడా లేదు. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న హామీ ఇచ్చినందునే ఆ సమయంలో ఇక రీషెడ్యూలు అన్న మాటకు తావేలేదన్నారు. వారీ మాటలు చెబుతున్న సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలిసిన విషయమే. విడిపోతే ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోవలసి వస్తుందన్న వాస్తవం, రెవెన్యూ లోటు ఉంటుందన్న విషయం జగద్విదితమే. ముఖ్యంగా చంద్రబాబుకు ఇవన్నీ తెలుసు. రాష్ట్ర విభజన గురించి మాట్లాడిన సందర్భాల్లో రెవెన్యూ లోటుపైన కూడా స్పష్టంగా మాట్లాడారు. పైగా తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లపాటు  ప్రతిపక్ష పార్టీ నేతగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకున్న చంద్రబాబుకు ఇవన్నీ తెలియకకాదు. ఆ సమయంలో అధికారం ఒక్కటే ఆయన కళ్ల ముందు కనబడింది. ఓట్లు వేయించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రైతులందరికీ రుణ మాఫీ చేస్తామన్న హామీ ఇచ్చారు.



అసలు రుణాలు ఎన్ని?



నిజానికి రైతుల రుణాలు ఎన్ని ఉన్నాయి? బ్యాంకులు ఎన్ని రుణాలు మంజూరు చేశాయన్న వివరాలన్నీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రతి ఏటా విడుదల చేస్తుంది. చంద్రబాబు రుణ మాఫీ హామీ ఇచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీసుకున్న మొత్తం రుణాలు 87,612 కోట్లు రూపాయలు, డ్వాక్రా మహిళా రుణాలు మరో రూ. 14,204 కోట్లు. గతేడాది గిట్టుబాటు లేక, ఆశించిన దిగుబడి రాక దిగాలుగా ఉన్న రైతాంగం రుణాలు మాఫీ అవుతాయనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికారం చేపట్టగానే రైతుల, పొదుపు సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ తొలి సంతకం చేస్తానని చెప్పడంతో రైతాంగం గంపెడాశలు పెట్టుకున్నారు.  ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మధ్య దాదాపు నెల రోజుల వ్యవధి తీసుకున్నారు. ఆ సమయంలోనూ చంద్రబాబు అధికారిక సమావేశాలు నిర్వహించి మరీ రుణాల గణాంకాలను పరిశీలించారు. ఇంతజరిగిన తర్వాత దేశంలోనే అత్యంత ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూన్ 8 న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గడియలు లెక్కపెట్టుకుంటున్న రైతులకు చంద్రబాబు పిడుగులాంటి వార్త వినిపించారు. రుణ మాఫీ చేస్తూ తొలి సంతకం చేయలేదు. సరికదా, రుణాల మాఫీ  విధివిధానాలు ఖరారు చేయడానికంటూ ఒక కమిటీని నియమిస్తున్నామని, ఆ కమిటీని నియమించే ఫైలుపై సంతకం పెట్టి పెద్ద గందరగోళానికి తెరలేపారు. నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య అధ్యక్షతన కమిటీ వేసి 15 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత 45 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తుందని చెప్పారు. ఆ నివేదిక కూడా సమర్పించడం పూర్తయింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి దాదాపు రెండు నెలలు కావస్తోంది. కోటయ్య కమిటీ నివేదిక సమర్పించేంత వరకు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం చెబుతూనే వచ్చింది. ఒకవైపు కోటయ్య కమిటీతో చర్చలు జరుపుతూనే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాఫీ లేదని ఒకరోజు, బంగారు రుణాలకూ వర్తింప జేస్తామని మరోరోజు, బోగస్‌లున్నారంటూ రుణాలన్నింటినీ ఆధార్‌తో లింకు చేస్తామని ఒకరోజు, ఇంటికి ఒక్క రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తామని మరోరోజు, మొత్తంగా లక్షన్నర వరకు మాఫీ చేస్తామంటూ మరోసారి- ఇలా రోజుకో ప్రకటన చేస్తూ రైతులను గందరగోళంలో నెట్టడం తప్ప ఆచరణలో రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గడిచిన రెండు నెలల కాలమంతా ఇదే తంతు.



50 లక్షల మందికి రుణ మాఫీ వర్తించదా?



రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేసుకుంటున్న తరుణంలోనే చంద్రబాబు ఎస్‌ఎల్‌బీసీ సమావేశాన్ని నిర్వహించి రానున్న కాలానికి రుణ ప్రణాళికను ఖరారు చేశారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్టు మంత్రిమండలి సమావేశం తీర్మానించిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారు. దేశంలో ఒక్కసారిగా ఇంతటి రుణాలను మాఫీ చేసిన ఘనత మాదేనని చాటుకున్నారు. మాఫీ చేయబోయే రుణాల భారం 30 నుంచి 35 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. దౌర్భాగ్యమేమంటే... మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ రుణాలను మాఫీ చేశామంటూ గడిచిన వారం రోజులుగా పండుగలు కూడా చేసుకుంటున్నారు. రైతులు తీసుకున్న రుణాలన్నీ కలిపి రూ. 87,612 కోట్లు  ఉండగా, రూ. 30 నుంచి 35 వేల కోట్ల మేరకు మాఫీ చేస్తున్నట్టు చెప్పడంలోని ఆంతర్యమేంటి? మిగతా రుణాల సంగతేంటి? దాదాపు 50 లక్షల మంది రైతులకు రుణ మాఫీ వర్తించదని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అలాంటి వారి రుణాలు, వాటిపై ఇప్పుడు అదనంగా పడిన వడ్డీ భారం ఎవరు చెల్లించాలి? రుణాలు మాఫీ అవుతాయని సకాలంలో చెల్లించలేక ఇప్పుడు రైతులందరిపైనా వడ్డీ భారం పడింది. ఆ భారానికి ఎవరు బాధ్యత వహించాలి? అన్నదాతను ఈ రకంగా ఎంతకాలం మభ్యపెడుతారు? ఈ రకంగా ఎంతమేరకు రుణ మాఫీ జరుగుతుందో తెలియదుగానీ మరోవైపు రుణాలను రీషెడ్యూలు చేయాలంటూ రిజర్వు బ్యాంకుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. గత ఖరీఫ్‌లో తుపాను, కరువు పరిస్థితులు ఏర్పడినందున ఆ రుణాలను రీషెడ్యూలు చేయాలంటూ ఆర్‌బీఐని ప్రభుత్వం కోరింది. ఒకవైపు రుణాలను మాఫీ చేసినట్టుగానే ప్రచారం చేసుకుంటూ మరోవైపు రీషెడ్యూలు కోసం ఆర్‌బీఐకి లేఖలు రాస్తుండటం చూస్తుంటే అసలేం జరుగుతోందో అంతుబట్టక రైతాంగం గందరగోళంలో పడింది.



వడ్డీ భారం ఎవరు చెల్లించాలి?



రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించడానికి జూన్ 30 తోనే గడువు ముగిసింది. రైతులు సకాలంలో రుణాలను చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుంది. లక్ష లోపు రుణాలకైతే వడ్డీ ఉండదు. కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. రుణాలన్నీ మాఫీ అయి భారం తగ్గుతుందని ఆశించిన రైతులపై ఇప్పుడు మరింత భారం పడింది. గడువులోగా రుణాలను చెల్లించని రైతులపై ఇప్పుడు వడ్డీ భారం పడింది. సకాలంలో చెల్లించని కారణంగా రైతులంతా డిఫాల్టర్లుగా మారిపోయారు. దాంతో నిరర్ధక ఆస్తులు (మొండి బకాయిలు) పెరిగిపోతున్నాయంటూ బ్యాంకులు కొరడా ఝుళిపించాయి. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ రైతులకు డిమాండ్ నోటీసులు పంపించాయి.  రుణం మాఫీ అవుతుందని ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించమంటూ నోటీసులు అందుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పైగా ఆ అప్పులకు తోడు ఇప్పుడు ఆ రుణాలపై వడ్డీ భారం కూడా రైతుల నెత్తిన పడింది. జూన్ 30 తో గడువు ముగియడంతో ఇప్పుడు రైతులు తాము తీసుకున్న రుణాలపై 12.5 శాతం వడ్డీ చెల్లించాలి. అది కూడా అప్పు తీసుకున్న రోజు నుంచి ఆ వడ్డీ భారాన్ని రైతులపై మోపుతారు. రుణాల మాఫీ సంగతేంటో తేలక సతమతమవుతూ కొత్త రుణాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇప్పుడు వడ్డీ భారం పడుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడీ వడ్డీ భారం ఎవరు మోయాలి? రుణాలు మాఫీ అవుతున్నాయని ఇంతకాలం చెబుతూవచ్చి ఇప్పుడు అసలుతో పాటు అదనంగా వడ్డీ చెల్లించమంటే ఎలా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ వడ్డీ తామే చెల్లిస్తామని ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? రైతులను ఎందుకు మభ్యపెడుతున్నారు?



బీమా సౌకర్యమూ లేదు



వడ్డీ సంగతి ఇలావుండగా, మరోవైపు పంటల బీమా సౌకర్యాన్ని రైతు కోల్పోతున్నారు. మండలం యూనిట్‌గా బీమా వర్తింపజేయడం, ఆచరణలో స్పష్టత లేకపోవడంతో రైతాంగం పంటల బీమాపై ఇప్పటికే సందిగ్ధంలో ఉండగా, అప్పులిచ్చిన సందర్భంలోనే బ్యాంకులు బీమా సొమ్మును జమ చేసుకుంటున్నాయి. ప్రకృతి విపత్తు తలెత్తి మండలంలో మెజారిటీ గ్రామాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయినా మొత్తం గ్రామాల్లో పంటలు పోలేదన్న కారణంగా బీమా వర్తించడం లేదు.



వనరుల పేరుతో కొత్త డ్రామా?http://img.sakshi.net/images/cms/2014-07/51406574911_Unknown.jpg



ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు చెప్పని వనరులపై సర్కారు కొత్త డ్రామానే ఆడుతోంది. రుణ మాఫీ కోసం నిధులను సమకూర్చుకోవడానికి అవసరమైన సూచనలు ఇవ్వాలంటూ మరో కమిటీని వేసింది. ప్రభుత్వంపై రుణ మాఫీ భారం తగ్గించుకోవడానికి ఒకవైపు రకరకాల పరిమితులు, ఆంక్షలు విధిస్తూ మరోవైపు రుణాలను మాఫీ చేయడానికి ఆర్థిక వనరుల సమీకరణలో ప్రభుత్వం బిజీగా ఉందని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం విడ్డూరం. ఎర్రచందనం దుంగలు బహిరంగ మార్కెట్‌లో విక్రయించి వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని రుణ మాఫీ కోసం వినియోగిస్తామని కొద్దిరోజులు, ఇసుక వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని దీనికి సమకూర్చుతామంటూ మరికొద్ది రోజులు ఆయా శాఖల సమీక్షలు నిర్వహించడాన్ని బట్టి  దాటవేత ధోరణి స్పష్టమవుతోంది. ఇసుక తవ్వకంపై న్యాయస్థానాలు నిషేధాజ్ఞలు విధించగా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుందనీ, వచ్చిన ఆదాయాన్ని రుణ మాఫీకి వినియోగిస్తామని చెప్పడంతోనే సర్కారు ఆంతర్యమేంటో తేటతెల్లమవుతోంది. ఇవే కాకుండా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి వాటి ద్వారా వచ్చే సొమ్మును వినియోగిస్తామంటూ కొద్ది రోజులు ప్రచారం చేశారు. ఏపీబీసీఎల్ ద్వారా జరుపుతున్న మద్యం విక్రయాల ద్వారా పది వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నందున దాన్ని తనఖాపెట్టి వనరులు సమీకరిస్తామంటూ... ఒకటేమిటి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా రుణ మాఫీపై ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెలలు కావస్తుండగా, రుణ మాఫీపై ప్రభుత్వం మాట్లాడని రోజంటూ ఉండటం లేదు. ఇంతచేసినా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క రైతు రుణం కూడా మాఫీ కాలేదు. ఆలస్యంగానైనా ఇప్పుడు పడుతున్న వర్షాలతో సేద్యంపై ఆశలు చిగురిస్తున్నప్పటికీ వెంటాడుతున్న అసలు, వడ్డీల భారం రైతులను నిద్రలేకుండా చేస్తోంది. కాస్తాకూస్తో పడుతున్న వర్షాలతో దుక్కి దున్నాలన్నా కొత్త రుణాలు ఇచ్చే వారు లేక ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటే ఈ అప్పూ ఆ అప్పూ అన్నీ కలగలిపి రైతు సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదకర పరిస్థితులు కనబడుతున్నాయి.



 

ఇవీ రైతన్నల సందేహాలు

 


ఎప్పుడు మాఫీ చేస్తారో ఎలా మాఫీ చేస్తారో చెప్పకుండా ప్రభుత్వం అయోమయాన్ని సృష్టిస్తోంది.బ్యాంకులకు వెళ్తే కొత్త అప్పులు ఇవ్వడం లేదు. ‘‘పాతవి కట్టి కొత్తవి తీసుకోవాలని వ్యవసాయ మంత్రే చెప్పారుగా... బాకీలు చెల్లించం’’డని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

జూన్ 30 లోపునే మేం రుణాలు బ్యాంకులకు చెల్లించి ఉంటే లక్షలోపు రుణానికి మాకు అసలు వడ్డీయే పడేదికాదు. చంద్రబాబు మాటలు నమ్మి మేం రుణాలు కట్టలేదు. ఇప్పుడు ఆయన మంత్రేమో కట్టమంటున్నాడు. టైమ్ అయిపోయినందున ఇప్పుడు కడితే గతేడాదికే  13 వేల రూపాయల చొప్పున (లక్షకు) వడ్డీ కట్టాలి. ఈయేడు ఎలాగూ మిగిలే ఉంది. ఏమిటిదంతా? మాతో ఎందుకు ఆడుకుంటున్నారు?ఈ వడ్డీలు ఎవరు కడతారు?ఏదీ స్పష్టత ఇవ్వకుండా మాఫీ చేశామని గొప్పులు చెబుతున్నారు.వీళ్ల మాటలు నమ్మి పంటల బీమాపైన ఆశలు వదులుకోవలసి వచ్చింది.ఈ మొత్తం రుణాలు లక్ష కోట్లపై చిలుకున్నాయి. (డ్వాక్రా రుణాలు కలిపి) చంద్రబాబేమో 30 లేదా 35 వేల కోట్లు మాఫీ చేస్తానంటున్నాడు. అదే 96 శాతం అంటున్నారు. లక్షల్లో 35 వేలు సగం కూడా కాదుగదా. ఇదేమి లెక్క? అంతా గందరగోళం.



-కె.సుధాకర్ రెడ్డి

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top