పోలింగ్‌లో జమ్మూకశ్మీర్ రికార్డ్! | Sakshi
Sakshi News home page

పోలింగ్‌లో జమ్మూకశ్మీర్ రికార్డ్!

Published Wed, Nov 26 2014 12:44 AM

పోలింగ్‌లో జమ్మూకశ్మీర్ రికార్డ్!

అత్యధికంగా 71.28% పోలింగ్ నమోదు
హింసాత్మక ఘటనలు లేకుండా ముగిసిన తొలిదశ పోలింగ్
కశ్మీర్‌లోని 15, జార్ఖండ్‌లోని 13 స్థానాల్లో పూర్తయిన పోలింగ్

 
శ్రీనగర్/రాంచీ/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో జమ్మూకశ్మీర్ రికార్డు సృష్టించింది. 71. 28% ఓటింగ్‌తో ఒక రికార్డును.. ఎలాంటి హింసాత్మక, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ముగించి మరో రికార్డును సొంతం చేసుకుంది. తొలిదశ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోనూ 61.92% ఓటింగ్ నమోదు కావడం విశేషం. వేర్పాటు వాదుల బహిష్కరణ పిలుపును కాదని జమ్మూకశ్మీర్ ప్రజలు.. మావోయిస్టుల దాడుల భయాన్ని పక్కన బెట్టి జార్ఖండ్‌వాసులు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని ఈ 15 స్థానాల్లో 61.23% ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో(2009) జార్ఖండ్‌లో ఈ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో 59% ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని 15స్థానాలకు(జమ్మూలో 6, కశ్మీర్‌లోయలో 5, లడఖ్‌లో 4) మంగళవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హురియత్ కాన్ఫరెన్స్‌లోని అన్ని వర్గాలు, జేకేఎల్‌ఎఫ్.. తదితర వేర్పాటువాదులంతా ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపును,  అక్కడ తీవ్రమైన చలి వాతావరణాన్ని లెక్కచేయకుండా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కశ్మీర్ లోయలోని స్థానాల్లో.. గందర్బల్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 68%, మిలిటెంట్లకు, ఎన్‌కౌంటర్లకు ప్రఖ్యాతి గాంచిన బందిపొరలోని 3 సీట్లలో 70.3% ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఇక్కడి సోనావరి స్థానంలో అత్యధికంగా 80.1% ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పలు నియోజకవర్గాల్లో తమకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ల్లో వలసవెళ్లిన కశ్మీరీ పండిట్లలో చాలామంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 3,441 మంది ప్రవాస కశ్మీరీ పండిట్లు ఓటుహక్కు కోసం రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 1,268 మంది మంగళవారం ఓటేశారు. సాధారణంగా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే లడఖ్ ప్రాంతంలో ఈసారి ఓటింగ్ శాతం తగ్గడం గమనార్హం. ‘జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి హింసాత్మక, అవాంఛనీయ ఘటనలు జరగకుండా 100% శాంతియుతంగా పోలింగ్ ముగిసింది’ అని డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వినోద్ జుట్షి పేర్కొన్నారు. అవసరమైన చోట్ల పోలింగ్ బూత్‌ల వద్దకు సిబ్బందిని సైనిక హెలీకాప్టర్లలో పంపించామన్నారు. ఎన్నికల సందర్బంగా రూ. 55 లక్షల నగదును, కొద్ది మొత్తంలో మద్యాన్ని  స్వాధీనం చేసుకున్నామన్నారు.

జార్ఖండ్‌లోని మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మంగళవారం తొలిదశ ఓటింగ్ చదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. చాత్రలోని మూడు ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. అదే ప్రాంతం నుంచి 12 కేజీల పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాలములో కొందరు దుండగులు ఈవీఎం కంట్రోల్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. జార్ఖండ్‌లో గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నమోదైన ఓటింగ్ శాతం కన్నా ఈ సారి 34% అధికంగా నమోదైందని ఎన్నికల సంఘం రాష్ట్ర ఇన్‌చార్జ్, డెప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా వెల్లడించారు. రూ. 81.6 లక్షల నగదును, రూ. 97 లక్షల విలువైన మద్యాన్ని, రూ.4.9 లక్షల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. హింస, ఉగ్రవాదం.. ఈ సిద్ధాంతాలను రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని ఈ ఓటింగ్ ద్వారా రుజువైందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఓటేసిన 102 ఏళ్ల వృద్ధురాలు

రాంబన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కబ్బి గ్రామ పోలింగ్ బూత్‌లో 102 ఏళ్ల నూర్ బీబీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను పోలింగ్ బూత్‌కు ఎత్తుకుని వచ్చి ఓటేయించారు. వేర్పాటువాదం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఆమె ఓటేశారని, 1957 నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓటేయకుండా లేరని నూర్ బీబీ కుటుంబ సభ్యులు తెలిపారు.
 
ఎందుకీ చైతన్యం!

 
జమ్మూకశ్మీర్‌లో తొలిదశ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరగడానికి, రాష్ట్ర ప్రజల్లో రాజకీయ చైతన్యం వెల్లివిరయడానికి కారణాలపై చర్చ ప్రారంభమైంది. ప్రజల్లో మార్పొస్తోందని, ఉగ్రవాదాన్ని, హింసను వ్యతిరేకిస్తున్నారని, వేర్పాటువాదానికి మద్దతు తగ్గుతోందని.. దీనికి భారీగా పెరిగిన ఈ పోలింగ్ శాతమే రుజువని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఏ పార్టీకి ఓటేస్తున్నామన్నది కాదు.. ఓటుహక్కును వినియోగించుకోవడమే మాకు ముఖ్యం’ అని ఒక న్యూస్ చానల్‌తో ఓ పౌరుడు చేసిన వ్యాఖ్య.. ప్రజల్లో వచ్చిన మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది. ‘సరైన భద్రత ఏర్పాట్లు, ప్రజల్లో విశ్వాస కల్పన, ఓటర్లలో పెరిగిన ఉత్సాహం’ ఓటింగ్ శాతం పెరగడానికి ఇవే ప్రధాన కారణాలని ఎన్నికల సంఘం పేర్కొనడం గమనార్హం. వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును కాదని ఈ స్థాయిలో రాష్ట్ర ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి.
 

Advertisement
Advertisement