మోదీతో అరగంట పాటు పన్నీర్‌సెల్వం భేటీ | Sakshi
Sakshi News home page

మోదీతో అరగంట పాటు పన్నీర్‌ భేటీ

Published Mon, Aug 14 2017 3:08 PM

మోదీతో అరగంట పాటు పన్నీర్‌సెల్వం భేటీ - Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అమ్మ శిబిరం, పన్నీర్‌ సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాలు విలీనంపై చర్చ జరిగినట్లు సమాచారం. అరగంటకు పైగా ఈ భేటీ కొనసాగింది.

సమావేశం అనంతరం పన్నీర్‌ సెల్వం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై ప్రధాన మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. అలాగే పళనిస్వామి సర్కార్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. రెండు వర్గాల విలీనంపై మీడియా ప్రతినిధులు... పన్నీర్‌ సెల్వంను ప్రశ్నించగా... ‘మీకు కావాల్సినట్లు మీరు ఊహించుకుంటారు’ అని సమాధానం ఇచ్చారు. తమిళనాడు ప్రజలతో పాటు, పార్టీ కేడర్‌ కోరుకునే విధంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు.

కాగా పన్నీర్‌సెల్వంతో పాటు అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్‌ కూడా ప్రధాని భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పాటు,  అన్నాడీఎంకే వర్గాల విలీనంపై ప్రధానంగా చర్చ జరిగిందని, అయితే మరొక పార్టీ వ్యవహారాల్లో జోక్యం ఉండదని ప్రధాని స్పష్టం చేసినట్లు మైత్రేయన్‌ వెల్లడించారు. కాగా మోదీ భేటీ అనంతరం పన్నీర్‌ సెల్వం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బాబా సన్నిధి నుంచి ఢిల్లీకి..
చెన్నై నుంచి ముంబయి మీదుగా షిర్డీ చేరుకున్న పన్నీరు సెల్వం ఆదివారం ప్రత్యేక పూజల్లో లీనం అయ్యారు. తన శిబిరం మద్దతు నేతలు కేపీ మునుస్వామి, సెమ్మలై, మైత్రేయన్‌లతో కలిసి షిర్డి సాయినాథుడ్ని దర్శించుకున్నారు. అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, శని భగవానుని ఆలయంలో విశిష్ట పూజలు చేయడం గమనార్హం. ఈ పూజల అనంతరం నేరుగా ముంబయి చేరుకుని సాయంత్రం ఢిల్లీలో పన్నీరు అడుగు పెట్టారు.  పదవుల పందేరం విషయంగా త్యాగాలకు పళని మెట్టు దిగడం లేదన్న విషయాన్ని పన్నీర్‌ సెల్వం ఈ సందర్భంగా మోదీ దృష్టికి తీసుకు వెళ్లారు.

సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అమ్మ శిబిరం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాల విలీనానికి ప్రధాని నరేంద్ర మోదీ రాజీ ప్రయత్నాలు సాగించినట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధానితో భేటీ అయ్యారు. ఇప్పటికే అమ్మ శిబిరం తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది.

ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను సాగనంపగా, ఎన్నికల కమిషన్‌ నుంచి వెలువడే నిర్ణయం మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు చెక్‌ పెట్టేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి పళని, పన్నీరు వేర్వేరుగా వెళ్లినా, విలీనం విషయగా ఏ ప్రకటన వెలువడ లేదు. అదే సమయంలో పళని మాత్రం ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తదితరులతో సమావేశం అయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement