'మోదీ హాల్మార్క్ సృష్టించారు' | Sakshi
Sakshi News home page

'మోదీ హాల్మార్క్ సృష్టించారు'

Published Fri, May 22 2015 12:38 PM

'మోదీ హాల్మార్క్ సృష్టించారు' - Sakshi

న్యూఢిల్లీ : ఎన్డీయే  అధికారపగ్గాలు చేపట్టిన సంవత్సరకాలం పూర్తికావస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్  జైట్లీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.   సంవత్సర కాలంలో  బీజేపీ ప్రభుత్వం విజయాలను, చేపట్టిన అభివృద్ధి పథకాలను మీడియా ముందుంచారు. మోదీ త్వరితంగా నిర్ణయాలు తీసుకోవటంలో కొత్త ప్రమాణాలు సృష్టించారన్నారు.

ప్రధానమంత్రిగా మోదీ  బాధ్యతలు స్వీకరించిన  తరువాత కొత్త శక్తి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరకాలంగా అవినీతి రహిత పాలనను  అందించామన్నారు. వేగంగా అభివృధ్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మనది  కూడా ఒకటన్నారు.   జీఎస్టీ బిల్లు, ల్యాండ్ బిల్లులను పార్లమెంటు ఆమోదానికి తీవ్రంగా కృషి చేశామని చెప్పారు.

బ్యాంకుల పనితీరు బాగుపడిందనీ,  గత సంవత్సర కాలం నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక లోటును తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఉందని జైట్లీ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల  అధికార దుర్వినియోగం అనేది పాతమాట అనీ, ఇపుడవి చాలా చురుకుగా, పారవర్శకంగా పనిచేస్తున్నాయన్నారు.

ప్రధాని విదేశీ పర్యటనపై విమర్శిస్తున్నవారు  55 రోజులు సెలవు  గురించి ఏ మాట్లాడతారని  అరుణ్ జైట్లీ  ప్రశ్నించారు.  ప్రధాని మోదీ 18 దేశాల  పర్యటన ద్వారా భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో  ఉంచామన్నారు.ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినట్లు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.  మరోవైపు ఢిల్లీ ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదంపై మాట్లాడతూ సమస్య రాజకీయమైనా..  రాజ్యాంగ బద్ధంగా వివాదాల్ని పరిష్కరించుకోవాలన్నారు.

Advertisement
Advertisement