జస్టిన్ ట్రూడో చేతిలో జస్టిన్ ట్రూడో.. వైరల్ | Sakshi
Sakshi News home page

జస్టిన్ ట్రూడో చేతిలో జస్టిన్ ట్రూడో.. వైరల్

Published Mon, Jul 17 2017 9:07 AM

Canada PM Justin Trudeau Meets Namesake



ఒట్టావా‌: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉద్వేగానికి లోనయ్యారు. శనివారం ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ చిన్ని జస్టిన్ ట్రూడోను అప్యాయంగా ఎత్తుకుని ముద్దాడిన సందర్బంలో ఆయన ఆనందం రెట్టింపయింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుజ్జి జస్టిన్ ట్రూడోకు ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు. అయితే జస్టిన్ ట్రూడో పేరేంటి అంటారా. ఆ వివరాలు.. సిరియాలోని డెమాస్కస్‌కు చెందిన మహ్మద్, ఆఫ్రా బిలాల్ అనే దంపతులు గతేడాది ఫిబ్రవరిలో శరణార్థులుగా కెనడాకు వలసొచ్చారు.

ఇక్కడి ఆల్బర్టా అనే ప్రాంతంలో ఈ జంట నివాసం ఉంటోంది. కెనడాకు వచ్చిన కొన్ని రోజులకు వీరికి ఓ పండండి బాబు పుట్టగా.. శరణార్థులుగా తమకు ఎంతో దయగా దేశంలోకి అనుమతులిచ్చిన ప్రధాని జస్టిన్ ట్రూడో పేరునే బాబుకు పెట్టారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రధానిని కలిసి తమ కుమారుడు జస్టిన్ ట్రూడోను చూపించాలని సిరియా దంపతులు భావించారు. అంత త్వరగా తమ కోరిక నెరవేరుతుందని మహ్మద్, ఆఫ్రా బిలాల్‌లు ఊహించలేదు.


 
కాల్గరీలోని ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చారని చూసేందుకు ఈ భార్యాభర్తలు వెళ్లారు. వీలు దొరకడంతో ప్రధానిని సిరియా జంట కలిసింది. 'మా బాబుకి మీ పేరే పెట్టుకున్నాం. జస్టిస్ ట్రూడోను అందుకోండి' అంటూ తల్లి ఆఫ్రా బాబును ప్రధాని చేతిలో పెట్టారు. తమకు ఇక్కడ ఉండేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీ పేరే బాబుకె పెట్టామని దంపతులు చెప్పారు. జస్టిన్ ట్రూడోను ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తుకోగా ఫొటోగ్రాఫర్ అడమ్ స్కాటి ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక అంతే.. జస్టిన్ ట్రూడోను ఎత్తుకున్న జస్టిన్ ట్రూడో అంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్‌గా మారి విపరీతంగా లైక్స్‌, కామెంట్లతో దూసుకుపోతోంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement