సర్కారుకు శరాఘాతం

సర్కారుకు శరాఘాతం - Sakshi

సదావర్తి భూములకు మళ్లీ వేలం.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

 

సాక్షి, హైదరాబాద్‌: మూడున్నరేళ్లుగా అన్ని రంగాలనూ అవినీతిమయం చేసి లక్షల కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు సర్కారు దేవుడు భూములను సైతం కారుచౌకగా కాజేయాలని చేసిన ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. సరైన టెండర్‌ కూడా లేకుండా... ఎకరం రూ.6 కోట్లు పలుకుతోందని దేవాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ లిఖితపూర్వకంగా నివేదించినా పట్టించుకోకుండా తన బినామీలకు  సదావర్తి భూములు కట్టబెట్టి కమీషన్లు కొట్టేయాలనుకున్న ముఖ్యమంత్రి ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. సత్రం భూములను వేలం వేయాలని అధికారులు, ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టిన సర్కారుకు హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారింది.



నిబంధనలన్నీ అతిక్రమించి మరీ బరితెగించిన ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షం చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. కొనేందుకు ఎవడూ ముందుకు రావడం లేదని ఒకసారి, ఆక్రమణలున్నాయని మరోసారి కోర్టును సైతం మభ్యపెట్టబోయిన చంద్రబాబు సర్కారు చివరకు యూటర్న్‌ తీసుకుంది. హైకోర్టు ఆదేశించినట్లుగా గడువులోగా ఆళ్ల రామకృష్ణారెడ్డి డబ్బు చెల్లించడంతో సర్కారు పెద్దలు కంగుతిన్నారు. రూ. 5 కోట్లు అదనంగా ఇస్తే సత్రం భూములు రాసిచ్చేస్తామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి మాటమార్చారు. తన బినామీల తరఫు న్యాయవాది చేత మరో వితండవాదన చేయించారు. వెయ్యికోట్ల విలువైన భూములు అంటున్నారు కనుక ఆళ్ల చేత రూ.500 కోట్లు కట్టించాలని హైకోర్టులో వాదించారు. న్యాయస్థానంలో తమ ఆటలు ఇక సాగవని గ్రహించి సత్రం భూములను ఎలాగైనా సరేదక్కించుకోవడం కోసం మరో కుయుక్తికి తెరతీశారు. తాజాగా వేలం నిర్వహిస్తామని సన్నాయినొక్కులు నొక్కుతూ రక్తికట్టించే ప్రయత్నం చేశారు.

 

వేలం నిర్వహించాలన్న హైకోర్టు..

సదావర్తి సత్రం భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో దిమ్మతిరిగే ఎదురుదెబ్బ తగిలింది.. వందల కోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను అతి తక్కువ రేటుకే కావాల్సిన వారికి కట్టబెట్టేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ భూములకు తిరిగి వేలం నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.27.44 కోట్లను కనీస ధరగా నిర్ణయించాలంది. చెన్నై సమీపంలో సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల భూమి వేలానికి సంబంధించి జాతీయ పత్రికల్లో కూడా ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సైతం వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని, అలాగే వేలం ఎప్పుడు వేస్తున్నారన్న విషయాన్ని ఆయనకు తెలియచేయాలని స్పష్టం చేసింది.



ఆరు వారాల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసింది. ఆ రోజున వేలం ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

ఆళ్ల పిటిషన్‌తో కదిలిన డొంక..

సదావర్తి సత్రానికి చెన్నై నగరానికి సమీపంలో ఉన్న 83 ఎకరాల అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కావాల్సిన వారికి నామమాత్రపు ధరకే కట్టబెట్టిందని, దీని వల్ల వందల కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా మొదట జరిగిన వేలంలో రూ.22.44 కోట్లకు భూములు దక్కించుకున్న వారి తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో ఇదే వ్యవహారంపై పిల్‌ దాఖలైందని, అందులో ఉన్న అంశాలనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన వ్యాజ్యంలో ప్రస్తావించారని తెలిపారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక పిటిషనర్‌కు సదుద్దేశం లేదన్నారు.



తాము వేలంలో కొన్న భూముల విలువ వెయ్యి కోట్లు ఉంటుందని పిటిషనర్‌ చెబుతున్నారని, అలాంటప్పుడు ఆయనను రూ.500 కోట్లనయినా డిపాజిట్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే ఆయన రూ.27 కోట్లే చెల్లించారని తెలిపారు. పిటిషనర్‌ వేలంలో పాల్గొనలేదని, అయితే ఇప్పుడు ఈ వ్యాజ్యం దాఖలు చేసి, దానిని అడ్డంపెట్టుకుని భూమిని కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. తమ అభ్యంతరాలన్నింటినీ రికార్డ్‌ చేయాలని కోర్టును కోరారు. 

 

ఆళ్లది సదుద్దేశమే: ధర్మాసనం వ్యాఖ్య

ఈ వ్యాజ్యం దాఖలు విషయంలో పిటిషనర్‌ సదుద్దేశాన్ని తెలుసుకునేందుకే తాము అదనంగా రూ.5 కోట్లు చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించామని ధర్మాసనం పేర్కొంది. తమ ఆదేశాల మేరకు పిటిషనర్‌ రూ. 27.44 కోట్లు చెల్లించి తన సదుద్దేశాన్ని చాటుకున్నారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘మాకు కావాల్సింది ప్రభుత్వ ఖజానాకు వేలం ద్వారా ఎక్కువ డబ్బు సమకూరడమే. అవి ప్రజల భూములు. మరోసారి వేలం వేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టే.. పిటిషనర్‌కు కూడా భూములు ఇవ్వడం లేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాత సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.



నెల రోజుల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్‌ స్పందిస్తూ, నెల రోజుల గడువు సరిపోదని, మరింత గడువు కావాలని కోరారు. సాధ్యం కాదని స్పష్టం చేసిన ధర్మాసనం ఆరు వారాల్లో వేలం ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను సెప్టెంబర్‌ 21కి వాయిదా వేసింది.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top