హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు - Sakshi


హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత సోమవారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.



ప్రత్యేక కోర్టు ఆదేశాలపై ఏసీబీ స్పందించింది. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది.



ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో మరో ఎఫ్‌ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ నివేదించింది. దర్యాప్తులో వెగులుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ఈ మెమో ద్వారా ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top