
లోకేశ్.. ఈ ఫొటోలకు సమాధానం చెప్పు
చంద్రబాబు నాయుడు గత రెండేళ్లలో 1.5 లక్షల కోట్ల రూపాయలు మేశారని అంబటి రాంబాబు ఆరోపించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్, మంత్రి ఉమా మహేశ్వరరావు చేస్తున్న అసత్య ప్రచారాలపై వైఎఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. విలువలు, గొప్ప లక్షణాల గురించి ప్రత్యేకంగా లోకేశ్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఆయనకున్న విలువలు, సంస్కారాలు, సంస్కృతుల గురించి ఇప్పటికే ప్రజలందరికీ తెలుసని అన్నారు. లోకేశ్ గతంలో అమ్మాయిలతో ఉన్న ఫొటోలను, ఇటీవల డిప్యూటీ సీఎం చినరాజప్పను ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను లోకేశ్ పాటించే విలువలు ప్రస్తావిస్తూ మీడియాకు విడుదల చేశారు. దమ్ముంటే ఈ ఫోటోలకు లోకేశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.1.5 లక్షల కోట్ల ప్రజల సొమ్మును మేశారని అంబటి అన్నారు. ఒక్కొక్కరికి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు చెల్లించి 20మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చెప్పారు. ఇన్ని వందల కోట్ల సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోట్లు కుమ్మరిస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయన విషయాన్ని అంబటి గుర్తు చేశారు.
అడ్డుగోలిగా అవినీతిగా వ్యవహరిస్తూ ఇష్టమొచ్చినట్లు ప్రెస్ మీట్లు చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలెవరు నమ్మరని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు పాల్పడుతున్న అవినీతిపై విచారణకు అంగీకరించాలని సవాల్ విసిరారు. తమ అధినేత వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణల విషయంలో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమామహేశ్వర్రావు మాట్లడుతూ నల్లధనం పదివేల కోట్లు ఎవరో ప్రకటించారని, అది తమ పార్టీ అధ్యక్షుడిదే అన్నతీరుగా మరోసారి ఆరోపించారని చెప్పారు.
వాస్తవానికి నల్లధనం ఎవరు ప్రకటిస్తారో వారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుందని, ఈ విషయం మీకు తెలిసిందంటే కచ్చితంగా ఆ పది వేల కోట్ల నల్లధనం చంద్రబాబు నాయుడు అండ్ కో వారిదేనని ప్రతి ఒక్కరికి అర్ధమవుతుందన్నారు. కేంద్రంలో భాగస్వామ్యం ఉన్న టీడీపీకి ఆ డబ్బు తమది కాదని, అది ఫలానా వారిదని చెప్పే దమ్ము కూడా లేదా అని ప్రశ్నించారు.