మచ్చలేని మనసున్నోడు... | Sakshi
Sakshi News home page

మచ్చలేని మనసున్నోడు...

Published Sat, Apr 22 2017 11:30 PM

మచ్చలేని మనసున్నోడు...

రాముని లక్షణాలను ఒక జానపద శైలిలో చెబితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో రాసిన పాట ఇది.రాములవారి కల్యాణంతో మొదలై ఆయన ప్రస్థానం ఎలా జరిగింది, చివరకు ఏ ధర్మాన్ని పాటించాడు... అనేంతవరకు ఒక సంపూర్ణ రాముడిని ఈ పాటలో చూపించాను. ఇందులో మూడు పల్లవులు ఉంటాయి. చరణాలు ఉండవు.

సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు /మారాజైనా మామూలోడు మనలాంటోడు/ మచ్చలేని మనసున్నోడు / జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు/వాడే... శ్రీరాముడు.../హే రాములోడు వచ్చినాడురో దాన్తస్సదియ్య శివధనుస్సు ఎత్తినాడురో/ నారి పట్టి లాగినాడురో దాన్తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో/ ఫెళఫెళఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు / భళభళభళ మంటు దిక్కులన్ని పేలినట్టు /బిలబిలమని విల్లు విరిచి జనక రాజు అల్లుడాయెరో...

శ్రీరాముడు సూర్యవంశీయుడు. కాని రాముడిని రామచంద్రుడు అని చంద్రునితో పోలుస్తాం. అందుకే ఆయన తేజం సూర్యవంశం, ముఖం పున్నమి చంద్రుడు. రాముడిలో సూర్యచంద్రులిద్దరూ ఉన్నారు.  రాముడిలో ఒక గొప్పతనం ఉంది. ఆయన మహారాజుగా జన్మించినప్పటికీ సామాన్యుడిలాంటి జీవితం గడిపాడు. మనలాగే జీవించాడు.

చంద్రుడిలో మచ్చ ఉందేమో కాని, రాముడిలో మచ్చ లేదు.  ప్రజల కోసం., ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ భూమి మీద సామాన్యుడిలా జన్మించిన కారణజన్ముడు శ్రీరామచంద్రుడు. అంతటి మహానుభావుడు శివధనుస్సు ఎక్కుపెట్టాడు.  దిక్కులు పిక్కటిల్లేలా, ఆకాసం కూలిన ట్లుగా విల్లు ఫెళ్లుమని విరిగింది. ఆ మహానుభావుడు జనక మహారాజుకి అల్లుడయ్యాడు... అని శ్రీరాముడిని ఒక సామాన్య మానవుడిలా పల్లవిలో ప్రశంసించాను.

 ఒక రోజు కంపోజింగ్‌కి ఆలస్యంగా చేరాను. అప్పటికే మరామరామరామరామ... అనే వాక్యం నిశ్చయమైపోయింది. ఆ వాక్యం నేను రాయకపోయినా, నా ఖాతాలోకి వచ్చి చేరింది. మంచి పాట వచ్చింది. మా అమ్మగారు అమిత రామభక్తురాలు. ఆవిడకు చాలా కాలం సంతానం లేదు. ఆవిడ రాముల వారిని అనునిత్యం పూజించేవారు. ఆ తరువాతే ఆవిడకు నేను పుట్టాను. ఈ పాట ద్వారా మా అమ్మగారికి ఇష్టమైన శ్రీరాములవారిని స్తుతించగలిగినందుకు నాకు సంతృప్తిగా ఉంది.
– సంభాషణ: డా. వైజయంతి

Advertisement
Advertisement