రాజధాని పేరుతో చేస్తున్నది ‘రియల్’ వ్యాపారమే

రాజధాని పేరుతో చేస్తున్నది ‘రియల్’ వ్యాపారమే - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో తాము చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ముఖ్యమంత్రి చంద్రబాబే ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో పరోక్షంగా అంగీకరించారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి చెప్పారు. తమ పార్టీ ఇంతకాలంగా చెబుతున్నది నిజమేనని సీఎం మాటలతో తేలిందన్నారు. ‘రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, వ్యాపారుల మాదిరిగా బ్రోచర్లు ముద్రించి మార్కెటింగ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి కదా?’ అని ఆ టీవీ ప్రతినిధి ప్రశ్నిస్తే.. సీఎం దానికి సమాధానం చెప్పకుండా ‘వీళ్లదేం పోయింది... అది రైతుల భూమి కదా...’ అని అన్నారని పార్థసారథి చెప్పారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.



ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసిన చంద్రబాబు.. రైతులు చాలా విజ్ఞులనీ, టీవీ వాళ్లు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు విజ్ఞులు కారన్నట్లుగా మాట్లాడారని పార్థసారథి విమర్శించారు. అన్నాహజారే, మేథాపాట్కర్ వంటి వారిని ప్రతిపక్షంలో ఉండగా పొగిడి, వాళ్ల కార్యక్రమాల్లో పాల్గొనడానికి తాపత్రయపడి.. ఇప్పుడు వారంతా విజ్ఞత లేని వాళ్లన్నట్లుగా బాబు మాట్లాడుతున్నారన్నారు. రైతులు తనపై నమ్మకంతో భూములు ఇచ్చారని చంద్రబాబు అనడం శుద్ధ అబద్ధమని, భూములివ్వకపోతే భూసేకరణ చట్టాన్ని అమలు చేసి బలవంతంగా సేకరిస్తామన్న ఆయన బెదిరింపులకు భయపడి ఇచ్చారని తెలిపారు.   



 బాబు ఏంచేసినా తాబేదార్ల లబ్ధి కోసమే!

 అభివృద్ధి పేరుతో చంద్రబాబు ఎక్కడ ఏది ఏర్పాటు చేసినా తన వర్గం, తన పార్టీ వారికి, తన తాబేదార్లకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటారని ఆయన విధానాలపై అధ్యయనం చేసిన ఓ విదేశీ విద్యార్థి స్పష్టం చేశారని, ఇప్పుడు రాజధాని విషయంలోనూ అదే నిజమైందని పార్థసారథి చెప్పారు. గతంలో హైటెక్ సిటీకి స్థలాన్ని ఎంపిక చేసి తన కార్యాలయానికి చేరుకోగానే బాబు చేసిన తొలి ఫోన్‌కాల్ మురళీమోహన్‌కు అని, తనకీ విషయాన్ని కొందరు అధికారులే చెప్పారన్నారు.



హైటెక్ సిటీ పక్కన జయభేరీ విల్లాలు తప్ప మరొకటి అప్పట్లో కనిపించలేదన్నారు. ఇప్పుడు తుళ్లూరును రాజధానిగా ప్రకటించడం కూడా బాబు తాబేదారుల లబ్ధి కోసమేనన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి ముందే  ఆ చుట్టుపక్కల భూములను తన వారితో బాబు కొనిపించారని  తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top