విద్యాశాఖకు బకాయిల గుదిబండ | Sakshi
Sakshi News home page

విద్యాశాఖకు బకాయిల గుదిబండ

Published Thu, Jun 22 2017 4:47 AM

విద్యాశాఖకు బకాయిల గుదిబండ

► ధుల కోసం విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
► గత ఏడాది పేరుకుపోయిన బకాయిలు రూ.7.88 కోట్లకుపైనే
► నిధులు విడుదల చేయని సర్కారు


ఒంగోలు: జిల్లా విద్యాశాఖకు వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నా యి. వివిధ విభాగాల్లో రూ.7.88కోట్ల మేర బకాయిలు నిలిచి పోయాయి.విద్యాశాఖ నుంచి తమకు చెల్లించాల్సిన నగదు కోసం యూనిఫాంలు కుట్టిఇచ్చిన డ్వాక్రామహిళలు, మధ్యా హ్న భోజనం చేసే కుక్‌కం హెల్పర్లు, సమ్మెటివ్‌ ప్రశ్నపత్రాలు ముద్రించిన ప్రింటర్లు ఇలా..పలువురు ఎదురు చూస్తున్నారు.
యూనిఫాం బకాయిలు
2017–18 సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ విడుదల చేసిన వార్షిక క్యాలెండర్‌లో యూనిఫాం జూన్‌ నెలాఖరులోగా పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. గత ఏడాది యూనిఫాం కుట్టించి పంపిణీ చేసే బాధ్యతను ఆప్కోకు కేటాయించారు. ఏడాది పూర్తయింది. కానీ ఇప్పటికీ రూ.3.80 కోట్లకుపైగా బకాయిలను సర్వశిక్షా అభియాన్‌ ఆప్కోకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆప్కో ద్వారా యూనిఫాం పొంది వాటిని కుట్టిన మహిళలు భగ్గుమన్నారు. ఒక్కో జత యూనిఫాంకు ఇచ్చే కుట్టుకూలి రూ.40 మాత్రమే అని, దానిని కూడా నిలిపివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సాక్షాత్తు సీఎం దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కోకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావాల్సి ఉండడంతో వారు తమకు నిధులు రాగానే ఇస్తామంటున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరినా ఇంత వరకు  మోక్షం కలగలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల గౌరవ వేతనం
సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మే, జూన్‌ నెలల్లో ఆరు బ్యాచ్‌లుగా ఉపాధ్యాయులకు అన్ని మండలాల్లో శిక్షణ ఇచ్చారు. సమావేశాలకు హాజరైన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రూ.350, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు రూ.375ల చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి శిక్షణ తరగతులు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల అకౌంట్లకు ఈ నిధులు జమచేస్తామని చెప్పారు. కానీ నేటికీ ఈ మొత్తం జమకాలేదు. ఈ మొత్తం సుమారు రూ.28.70 లక్షలు ఉంది.
మధ్యాహ్న భోజనం బకాయిలు:
మధ్యాహ్న భోజనానికి సంబంధించి కుక్‌ కం హెల్పర్లకు ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి, మార్చి , ఏప్రిల్‌ నెలలకు సంబంధించి ఇంతవరకు వారి ఖాతాలకు వేతనాలు జమకాలేదు. ఇలా చెల్లించాల్సిన మొత్తం రూ.3 కోట్లు ఉంటుందని అంచనా.

డీసీఈబీ ప్రింటింగ్‌ ఖర్చులు:
జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం జిల్లావిద్యాశాఖ అధికారి నేతృత్వంలో ఉంటుంది. ఈ విభాగం పరీక్షల నిర్వహణకు ప్రశ్నపత్రాలు తయారు చేసి వాటిని పాఠశాలలకు పంపాలి. గతంలో 1 నుంచి 9 తరగతుల వరకు ప్రశ్నపత్రాలను వీరే ముద్రింపజేసేవారు. కానీ గత ఏడాది 6 నుంచి 10 తరగతుల వరకు ఎస్‌సీఈఆర్‌టీ ముద్రించి పంపింది. దీంతో 1 నుంచి 5 తరగతుల వరకు విద్యార్థులకు మూడు సమ్మెటివ్‌ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు ముద్రించే బాధ్యత వీరిమీద పడింది. ఇప్పటికి ఈ విభాగం దాదాపు రూ.40 లక్షలకుపైగా ప్రింటర్స్‌కు బకాయి పడింది. గత ఏడాది మొత్తంలో రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఒక్క రూపాయి కూడా ఈ విభాగానికి విడుదల కాకపోవడంతో ప్రింటర్లు డీసీఈబీ కార్యాలయం, విద్యాశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మళ్లీ ఈ ఏడాది సమ్మెటివ్‌ పరీక్షలకు సంబంధించి జూలైలో ప్రింటర్ల వద్ద నుంచి టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది.

బాహ్య మూల్యాంకనానికి నిధులు నిల్‌
బాహ్య మూల్యాంకనానికి హాజరయ్యే ఉపాధ్యాయులకు రోజుకు రూ.200 చెల్లిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. సమ్మెటివ్‌ –1(త్రైమాసిక), సమ్మెటివ్‌–2(అర్ద సంవత్సర), సమ్మెటివ్‌–3(వార్షిక) పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 6 నుంచి 10 తరతగతుల వరకు పరీక్షలు రాసిన విద్యార్థులకు బాహ్యమూల్యాంకనం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తరువాత దానిని 5 శాతం ప్రశ్నపత్రాలను పరిశీలించాలని ఆదేశించారు. అయితే ప్రైవేటు , ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ మూల్యాంకనానికి హాజరయ్యే ఉపాధ్యాయులకు రోజుకు రూ.200లు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. కానీ సంవత్సరం మొత్తం అయిపోయి నూతన సంవత్సరం కూడా ప్రారంభంమైంది. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఉపాధ్యాయులకు అందలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఉపాధ్యాయులు ఆ మొత్తాలను అందుకోలేకపోయారు. సుమారుగా ఒక్కో ఉపాధ్యాయునికి దాదాపుగా రూ.2 వేలకుపైగా అందుతాయని అంచనా. ఇలా విడుదల కావాల్సిన మొత్తం రూ.40 లక్షలకుపైనే. 

Advertisement
Advertisement