రేపు రాష్ట్రబంద్ | YSRCP calls state strike tommorrow | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రబంద్

Jan 2 2014 2:59 AM | Updated on Aug 18 2018 4:13 PM

రేపు రాష్ట్రబంద్ - Sakshi

రేపు రాష్ట్రబంద్

రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వర్తమానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల 3న(శుక్రవారం) రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు వైఎస్సార్‌సీపీ పిలుపు
టీ బిల్లుపై రాష్ట్రపతి వర్తమానాన్ని కేంద్రం పంపిన తీరుకు నిరసన
వారం పాటు నిరసన కార్యక్రమాలు
4న బైక్ ర్యాలీ, 6న మానవహారాలు..
7-10 వరకు తాలూకా కేంద్రాల్లో  రిలే నిరాహార దీక్షలు: మైసూరారెడ్డి
బాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడి


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వర్తమానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల 3న(శుక్రవారం) రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాజకీయ వ్యవహారాల  కమిటీ(పీఏసీ)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని కూడా ఖరారు చేశారు. ‘రాష్ట్రపతి వ ర్తమానాన్ని’ కేంద్రం పంపిన విధానం రాజ్యాంగ స్ఫూర్తిని, సమాఖ్య స్ఫూర్తిని ఎగతాళి చేసే విధంగా ఉందని సమావేశం  అభిప్రాయపడింది. సమావేశం వివరాలను పార్టీ పీఏసీ సభ్యులు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడిస్తూ ఆ వర్తమానం పంపిన తీరు చూస్తే ఇక్కడుండేది ఒక రాష్ట్రమని, ప్రభుత్వం, చట్ట సభలున్నాయనే గుర్తింపు కూడా లేకుండా సొంత ఇంటి వ్యవహారంగా ప్రవ ర్తించారని ధ్వజమెత్తారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా శాసనసభలో వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

 నిరసనల వారం..

 కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 3న బంద్ చేయడంతో పాటుగా వరుసగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు పిలుపునిస్తున్నామని మైసూరా అన్నారు. 4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. శాసనసభా సమావేశాల్లో జరిగే పరిణామాలను బట్టి ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మూడూ దారుణంగా నష్టపోతాయని, అందుకే తమ పార్టీ సమైక్యం కోసం త్రికరణశుద్ధితో పోరాడుతోందని అన్నారు. ఏపీఎన్జీవోలు బంద్ కూడా 3నే ఉందని ప్రస్తావించగా శాసనసభా సమావేశాలు ప్రారంభం అవుతున్నది 3నే కనుక తమ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిందని, రెండూ యాధృచ్ఛికం కావచ్చని అన్నారు. అయినా సమైక్యం కోసం ఎవరు ఆందోళనకు పిలుపునిచ్చినా మద్దతునిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్, విభజించాల్సిందిగా లేఖ ఇచ్చిన టీడీపీతో కలిసి తమ పార్టీ పనిచేయబోదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 ఆ 18 అంశాలపై చర్చకు సిద్ధమే..

 అవినీతిపై జగన్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై మైసూరా స్పందిస్తూ.. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ.. బాబు తాలూకు 18 అవినీతి అంశాలపై హైకోర్టులో పిల్ వేస్తే సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకుని ఆపుకొన్నారని గుర్తుచేశారు. ఈ అంశాలపై ఆయన పిలిస్తే చర్చకు తాము సంసిద్ధమేనని అన్నారు. మంత్రుల శాఖల మార్పిడి అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, అయినా శ్రీధర్‌బాబు శాఖను మార్చడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. విభజన విషయంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. బిల్లుపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి చేసిన సూచనను ప్రస్తావించగా గతంలో రాష్ట్రాల ఏర్పాటులో గానీ, విభజనలో గానీ ఆయా అసెంబ్లీల్లో తీర్మానాలు చేయడం ద్వారానే సాధ్యమైందని అన్నారు. ఆర్టికల్ 3 కింద రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ అందుకు కచ్చితంగా ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలన్నారు. ఇదే విషయం సర్కారియా, పూంఛి కమిషన్లు రెండూ చెప్పాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement