మొండి ప్రభుత్వం మెడలు వంచుదాం

బుధవారం పులివెందులలో అంగన్ వాడీల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న వైఎస్ జగన్ - Sakshi


ప్రతి ఒక్కరూ ఉద్యమ బాట పట్టాలి: వైఎస్ జగన్

ప్రతిపక్ష నేతను కలిసిన డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ వర్కర్లు




సాక్షి, కడప: ‘టీడీపీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు మాఫీ చేయలేదు. గ్రూపునకు రూ.10 వేలు ఇస్తామని.. నేటికీ అందించలేదు. చివరకు ఏ రైతుకు కూడా సక్రమంగా రుణం మాఫీ చేయని ఈ మొండి ప్రభుత్వాన్ని ఏమనాలో తెలియడంలేదు..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పూరబట్టారు. ఆయన బుధవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న సమయంలో పలువురు అంగన్‌వాడీ వర్కర్లు, డ్వాక్రా మహిళలు కలిశారు.



డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని, రైతులకు రుణమాఫీ సక్రమంగా అందలేదని, అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కిరణ్ పేర్కొన్నా.. ఈ నాటికీ అమలుకు నోచుకోలేదని వారు జగన్‌కు వివరించారు. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి వెంటనే మాఫీ చేయాలని.. ప్రతి రైతుకు రుణమాఫీ అందించాలని ఈ మధ్యనే తణుకులో నిరాహారదీక్ష చేసిన విషయం గుర్తుచేశారు. అంతకుముందు కూడా మండల కార్యాలయాల వద్ద ధర్నాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టామని, ప్రస్తుత ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.



ప్రభుత్వం మెడలు వంచేవరకు ఉద్యమబాట పట్టాల్సిందేనన్నారు. పోరుబాటలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాల విషయానికి సంబంధించి వడ్డీలేని రుణాలను ఇవ్వాల్సి ఉండగా.. 2012 నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు ఎవరూ రుణాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశామని, చివరకు వాకౌట్ కూడా చేశామని అంగన్‌వాడీ వర్కర్లకు తెలిపారు. ప్రభుత్వం దాటవేత ధోరణి వీడి అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు పెంపునకు కృషిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.



పులివెందులలో బిజీబిజీగా..

వైఎస్ జగన్‌బుధవారం ఉదయాన్నే పులివెందుల చేరుకుని పలు కార్యక్రమాలలో బిజీగా గడిపారు. పలు వివాహాలకు హాజరయ్యూరు. ఇటీవల వివాహాలైన దంపతులను ఆశీర్వాదించారు. పలు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఇంటివద్ద, కార్యాలయం వద్ద ప్రజలతో తీరిక లేకుండా గడిపారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా జగన్‌తో చర్చించారు. కార్యక్రమాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రైల్వేకోడూరు, కదిరి ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top