
బిపిన్ చంద్ర మృతిపై వైఎస్ జగన్ తీవ్ర సంతాపం
సుప్రసిద్ధ చరిత్రకారుడు బిపిన్ చంద్ర మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సుప్రసిద్ధ చరిత్రకారుడు బిపిన్ చంద్ర మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ చంద్ర మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ... బిపిన్ చంద్ర మృతి తీరని లోటని అన్నారు. ఆయన రచనలు ఇతర చరిత్రకారులు, చరిత్ర అధ్యయనం చేసే విద్యార్థులకు చుక్కాని అని ఆయన అభివర్ణించారు. భారతదేశ చరిత్రపై బిపిన్ చంద్ర రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఆధునిక చరిత్రకారుడిగా ఖ్యాతి గడించిన బిపిన్ చంద్ర ఈ రోజు ఉదయం గుర్గావ్ లోని ఆయన స్వగృహాంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. 1928లలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వ్యాలీలో బిపిన్ చంద్ర జన్మించారు. 1983లో యూజీసీ సభ్యునిగా పని చేశారు. 2002 -2014 మధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్ గా విధులు నిర్వర్తించారు.