ఇసుక క్వారీ..మాఫియా స్వారీ | Sakshi
Sakshi News home page

ఇసుక క్వారీ..మాఫియా స్వారీ

Published Wed, Aug 20 2014 12:22 AM

ఇసుక క్వారీ..మాఫియా స్వారీ - Sakshi

  • యథేచ్ఛగా రవాణా
  •  పట్టించుకోని గనులశాఖ
  •  తూతూ మంత్రంగా దాడులు
  •  పాలసీ ప్రకటించని ప్రభుత్వం
  •  మూడేళ్లుగా జరగని రీచ్‌ల వేలం
  •  ఏటా రూ.కోట్లలో ఖజానాకు నష్టం
  • విశాఖపట్నం :  రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇసుక విధానం ఖరారు చేయకపోవడంతో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా సాగిపోతోంది.  కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఇసుక క్వారీలకు వేలం నిర్వహించకపోవడం వీరికి బాగా కలిసొచ్చింది.

    జిల్లాలో నిర్మాణ అవసరాలకు గాను ఇటు శ్రీకాకుళం అటు రాజమండ్రిలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా చార్జిలు తడిసి మోపెడయి ఇసుక రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిని సాకుగా తీసుకున్న ఇసుక మాఫియా పలు నదీ పరివాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తోంది. రోజూ అధికసంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలించుకుపోతున్నారు. విజిలెన్స్ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణా అరికట్టే నాథుడే కరువయ్యాడు.

    జిల్లాలోని శారద, వరాహ, తాండవ నది పరివాహక ప్రాంతాలు ఇసుకమాఫియా అడ్డాలుగా మారిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. దేవరాపల్లి మండలంలోని వేచలం, కలిగొట్ల, తిమిరం, తెనుగుబూడి, కొల్లివానిపాలెం, దేవరాపల్లి ఆనుకుని వున్న శారదానది కాజ్‌వే పక్కన రోజూ ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
     
    స్థానిక అధికారులు లారీకి రూ.15 వేలు, ట్రాక్టర్‌కి రూ.5వేలు వంతున ముడుపులు తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శారదానదిలో అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా గవరవరం, బొడ్డేరు బ్రిడ్జిలు కూలిపోవడం తెలిసిందే. ఇక ఇసుక తవ్వకాల పుణ్యమా అని తారువా, తెనుగుబూడి బ్రిడ్జిల పరిస్థితి ఆందోళన కరంగా వుంది. శారదానది కాజ్‌వే ప్రతి ఏడాదీ వర్షాల సమయంలో కొట్టుకుపోతున్న దుస్థితి నెలకొంది. ఇసుక తవ్వకాల కారణంగా పర్యావరణానికి, భూగర్భ జలాలకు ప్రమాదం అని తెలిసినా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    దేవరాపల్లి మండలం చింతలపూడి, కోటవురట్ల మండలం కొత్తగొట్టివాడ క్వారీలకు 2011లో వేలం నిర్వహించగా ప్రభుత్వానికి 5.67 కోట్ల ఆదాయం రావడం తెలిసిందే. వాల్టా చట్టంలోని అంశాలు, ఇసుక తవ్వకంలో యంత్రాల వాడకూడదనే నిబంధన, క్వారీలకు గడువు ముగియడం వంటి పలు కారణాల వల్ల మూడు సంవత్సరాలుగా జిల్లాలో ఇసుక క్వారీలకు వేలం నిర్వహించలేదని దుస్థితి నెలకొంది.

    దీనితో ప్రభుత్వ ఆదాయానికి గండి పడగా, ఇసుక మాఫియా మాత్రం రెండుచేతులా సంపాదించుకుంటోంది. నగరంలో రెండు యూనిట్ (తోపుడు ఆటో)ల ఇసుక ధర ఇటీవలే రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెరిగింది. దీనితో భవన నిర్మాణం భారంగా మారింది. ఇసుక పాలసీ ప్రభుత్వం త్వరగా ప్రకటిస్తే క్వారీలు అందుబాటులోకి వచ్చాక ఇసుక మాఫియాను అరికట్టవచ్చని పలువురు అంటున్నారు.
     
    మండల కమిటీలదే బాధ్యత
    ఆయా మండలాలలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి మండల స్థాయిలో తహశీల్దార్, ఎస్‌ఐ, వీఏఓలతో కమిటీలు వున్నాయి. అక్రమ ఇసుక రవాణా అరికట్టాల్సిన బాధ్యత ఈ కమిటీలపైనే వుంది. జీఓ-186 ప్రకారం ఆయా ప్రాంతాలలో లభించే ఇసుక అక్కడి అవసరాలకే వినియోగించాల్సి వుంది. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు వుంది.
     - భగవంతరెడ్డి, డెప్యూటీ డెరైక్టర్, గనులు భూగర్భశాఖ, విశాఖపట్నం
     

Advertisement
Advertisement