లాఠీ జులుం! | Sakshi
Sakshi News home page

లాఠీ జులుం!

Published Sun, Aug 30 2015 4:55 AM

లాఠీ జులుం! - Sakshi

సాక్షిప్రతినిధి, అనంతపురం :  ప్రత్యేకహోదా డిమాండ్ ప్రజల సమస్య. పదిరోజుల ముందు నుంచి బంద్ జరుగుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ రెండు రోజుల ముందు నుంచి ఆటోల్లో మైకు ద్వారా చెప్పారు. వ్యాపారులు, విద్యాసంస్థల యాజమన్యాలతో పాటు ప్రతీ ఒక్కరూ సహకరించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు విన్నవించారు. ఈ బంద్‌కు సీపీఐ, సీపీఎంతో పాటు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. దీంతో శనివారం తెల్లవారుజామునుంచే బంద్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా బంద్ మొదలైంది.

అయితే పోలీసులు బంద్ సందర్భంగా రోడ్లపై కనిపించిన ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ప్రశాంతంగా బంద్ చేస్తుంటే ఈ అరెస్టులేంటని నేతలు ప్రశ్నిస్తే వారిని దుర్భాషలాడారు. అనంతపురంలో బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, చవ్వారాజశేఖరరెడ్డి, సీపీఐ, సీపీఎం జిల్లా నేతలను ఉదయం 7గంటలకే అరెస్టు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే వీరిపై దురుసుగా ప్రవర్తించారు. ఇదంతా డీఎస్పీ మల్లికార్జున వర్మ ఆధ్వర్యంలో జరిగింది. మంచి అధికారిగా పేరున్న ఆయన బంద్ సందర్భంగా వ్యవహరించిన తీరుతో అన్నిపార్టీల నేతలు విస్తుపోయారు.

 ఎస్‌ఐ హమీద్ తీరుపై అభ్యంతరం:
 టూటౌన్ ఎస్‌ఐ హమీద్‌ఖాన్ ఆందోళన చేస్తున్న నాయకులను తీవ్ర పదజాలంతో దూషించారు. టవర్‌క్లాక్ వద్ద పార్టీ క్రమశిక్షణ కమిటీసంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దుర్భాషలాడారు. ఇదేం పద్దతని ఎర్రిస్వామిరెడ్డి ప్రశ్నిస్తే మరింత రెచ్చిపోయారు. రుద్రంపేట బైపాస్‌లో బైక్‌ర్యాలీ చేపడుతున్న రాజీవ్‌రెడ్డిపై ఇదే రీతిలో ఏకంగా లాఠీచార్జ్ చేశారు. దీనిపై ఎస్పీతో పాటు జిల్లా జడ్జికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. మడకశిరలో తిప్పేస్వామిపై సీఐ హరినాథ్ దురుసుగా ప్రవర్తించారు. హిందూపురంలో సీఐ ఈదర్‌బాషా మహిళా కౌన్సిలర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఇలా 14 నియోజకవర్గాల్లోనూ అరెస్టులు చేశారు.

Advertisement
Advertisement