
బాబుకు నెటిజన్ల షాక్
కర్నూలు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఒక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఒక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలపై ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనాన్ని ఉద్దేశించి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న ట్విటర్ అకౌంట్ నుంచి స్పందన వచ్చింది. 'బాబు.. ప్రజలు మిమ్మల్ని విమర్శించడం రుచించకపోతే వారి నుంచి పన్నులు వసూలు చేయడం ఆపండి, వాళ్లను ఓట్లు అడుక్కోవడం కూడా మానేయండి' ఇది ఆ పోస్టు సారాంశం.
అయితే, ఇది మాజీ ప్రధాని ట్విటర్ అకౌంట్ కాదని, అది ఫేక్ అకౌంట్ అని తేలింది. చంద్రబాబు చేసిన విచిత్రమైన వ్యాఖ్యలపై హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఆ వార్తను ఆ పత్రిక తన ట్విటర్ లో పోస్టు చేయగా మన్మోహన్ సింగ్ పేరుతో ఆయన ఫోటో ఉన్న ట్విటర్ అకౌంట్ నుంచి ప్రతిస్పందన పోస్టయింది.
'చంద్రబాబు.. ప్రజలు మిమ్మల్ని విమర్శించడం రుచించకపోతే వారి నుంచి పన్నులు వసూలు చేయడం ఆపండి, వాళ్లను ఓట్లు అడుక్కోవడం కూడా మానేయండి' అంటూ రీట్వీట్ చేశారు. దాంతో ఆ వార్తకు అనుకూలంగా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలను నెటిజన్లు సమర్థిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. ప్రజల సొమ్ముతో అందుకునే పించన్లను తీసుకోవద్దని, రోడ్లపై నడవొద్దని బాబు ఎలా అంటారని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. కర్నూలులో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని అంటున్నారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
నంద్యాలలో టీడీపీ శ్రేణులతో సమావేశమైన చంద్రబాబుతో తమ సమస్యలను ముఖ్యమంత్రితో చెప్పుకునేందుకు స్ధానికులు కొంతమంది వెళ్లారు. అక్కడి వెళ్లిన వారిని ఉద్దేశించి మాట్లాడిన బాబు.. సమస్యలు తర్వాత ముందు తాను చెప్పేది వినాలంటూ ఆపారు. సీఎం హోదాలో ఉన్నానని మరిచి.. కొందరు తాను ఇచ్చిన పించన్లతో బతుకీడుస్తూ.. తాను వేసిన రోడ్ల మీద నడుస్తూ.. తనకు ఓటు వేయడం లేదని అన్నారు. తనకు ఓటు వేయకపోతే.. పెన్షన్ తీసుకోవద్దని, రోడ్లపై నడొవద్దని అన్నారు. తాను ఒక్కోఓటుకు 5 వేల రూపాయలు ఇవ్వగలనని...అలా ఇస్తే మళ్లీ అవినీతికి పాల్పడాల్సి వస్తుందని అన్నారు. తనకు ఓట్లు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు.