కాంట్రాక్టరు మనోడే.. విచారణ వద్దు!


  • ‘అనంత’లో 15 మంది మృతి చెందిన ప్రమాదంపై ఇదీ తీరు

  • మంత్రి బంధువుకి ఇబ్బందులని నివేదిక ఊసెత్తని ప్రభుత్వం

  • సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీకి చెందిన వారిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది. 15 మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘోర దుర్ఘటనకు కారకుడైన అస్మదీయుడిని రక్షించేందుకు ఏకంగా విచారణకు మోకాలడ్డుతోంది. అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే హడావుడిగా ప్రకటనలు గుప్పించిన సీఎం, మంత్రులు ఇప్పుడు విచారణ ఊసెత్తడం లేదు.



    రాష్ట్రంలో రోజుకోచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా, వీటిపై గంటల కొద్దీ సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు, అధికారులు ప్రమాదాలపై లోతుగా విచారణ జరిపేందుకు చొరవ చూపడంలేదన్న ఆరోపణలున్నాయి. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారమే ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. ఈ ఏడాది జనవరి ఏడోతేదీన అనంతపురం జిల్లా మడకశిర నుంచి పెనుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 15 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.



    ఈ ప్రమాదంపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జనవరి 9న అప్పటి రవాణాశాఖ కమిషనర్ అనంతరామును ఆదేశించింది. తరువాత వారంలోనే  బదిలీ చేసింది. మళ్లీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినా, కొద్ది రోజుల్లోనే రవాణాశాఖకు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నియమించింది.

     

    కాంట్రాక్టర్‌ను రక్షించేందుకే..



    కాంట్రాక్టరు తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులిద్దరిని, ఆర్టీసీ అధికారులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు కాంట్రాక్టరుపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు. ఆ రోడ్డు పనిని సార్వత్రిక ఎన్నికలకు ముందు ద్వారకామయి కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత అనంతపురం జిల్లాకు చెందిన కీలక మంత్రి సమీప బంధువు ఆ కాంట్రాక్టరు నుంచి పనులు చేజిక్కించుకున్నారు.



    ఈ వ్యవహారంలో బెదిరింపులు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సబ్ కాంట్రాక్టరుగా రోడ్డు పనులు చేస్తున్న కృష్ణదేవరాయ కన్‌స్ట్రక్షన్స్‌పై క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అధికారులు సాంకేతిక కారణాలు చూపి టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని జనవరి తొమ్మిదిన ఆదేశించిన ప్రభుత్వం తరువాత ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చి సబ్ కాంట్రాక్టరు మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే విచారణను పక్కన పెట్టేసిందన్న ఆరోపణలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top