వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి కొణతాల రామకృష్ణ చేసిన రాజీనామాను పార్టీ
విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ వెల్లడి
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి కొణతాల రామకృష్ణ చేసిన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదిస్తూ అయిష్టంగానే ఆయన్ను పార్టీ సభ్యత్వం నుంచి విముక్తులను చేస్తున్నట్టు ప్రకటించారని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. తమ అధినేత మొదటినుంచి కొణతాల రామకృష్ణకు ఎంతో గౌరవం ఇచ్చారని చెబుతూ ప్రస్తుతం కూడా అంతే గౌరవంతో అయిష్టంగానే ఆయన రాజీనామాను ఆమోదించారన్నారు. విశాఖపట్నంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... కొణతాల అయిష్టంగా పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హుదూద్ తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నం జిల్లాలో ప్రజలను ఆదుకునేందుకు, సహాయచర్యలను పర్యవేక్షించేందుకు అధ్యక్షుడు వైఎస్ జగన్ హుటాహుటిన జిల్లాకు వచ్చినా కొణతాల రామకృష్ణగానీ, పార్టీ నేత గండిబాబ్జీగానీ ఆ పర్యటనలో పాల్గొనకపోవడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించిందని చెప్పారు.
నియోజకవర్గ ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గండి బాబ్జీని సమన్వయకర్త పదవి నుంచి తొలగించిన కారణంతో కొణతాల పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయడం, ఆ లేఖను ఎల్లో మీడియాకు లీక్ చేయడం సరికాదని పార్టీ అభిప్రాయపడిందని తెలిపారు. కొణతాలతో మాట్లాడేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా ఆయన ఫోన్లకు అందుబాటులో లేకుండాపోవడం... అందుబాటులోకి వచ్చినప్పటికీ సరైన సమాధానం చెప్పకపోవడం సరైన చర్య కాదన్నారు. టీడీపీతో కలసి పనిచేస్తున్న అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై చర్య తీసుకోవాలని కోరుతూ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వంశీకృష్ణ, కంప హనోక్ తదితరులు పాల్గొన్నారు.