మళ్లీ బెల్లం లావాదేవీలు | Sakshi
Sakshi News home page

మళ్లీ బెల్లం లావాదేవీలు

Published Tue, Apr 22 2014 12:46 AM

మళ్లీ బెల్లం లావాదేవీలు - Sakshi

     కళకళలాడిన అనకాపల్లి మార్కెట్
     54,980 దిమ్మలు రాక
     రూ.2 కోట్ల క్రయ, విక్రయాలు జరిగినట్లు అంచనా

 
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో సోమవారం నుంచి బెల్లం లావాదేవీలు మళ్లీ మొదలయ్యాయి. నల్లబెల్లంపై ఆంక్షలు, బెల్లం రవాణాపై కేసుల వేధింపుల నేపధ్యంలో వర్తకులు వారం రోజుల క్రితం లావాదేవీలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. సున్నితమైన ఈ అంశంలో ఓ వైపు రైతుల మనోభావాలు, వ్యాపారుల ఆర్థిక ఆసరా, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు చొరవ చూపడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది.

అనకాపల్లికి చెందిన వర్తకులు ఇటీవల గవర్నర్ కార్యదర్శి, ఇతర పోలీస్ శాఖ ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను విన్నవించడంతో అధికారుల నుంచి సానుకూల స్పందన వెల్లడయింది. దీంతో సోమవారం నుంచి బెల్లం లావాదేవీలు ప్రారంభించారు. మార్కెట్‌కు 54,980 దిమ్మలు రావడంతో యార్డులన్నీ కళకళలాడాయి.

మొదటిరకం గరిష్టంగా క్వింటాల్‌కు 2,650 రూపాయలు, మూడో రకం కనిష్టంగా 2,260 రూపాయలు పలికింది. దాదాపు 2 కోట్ల రూపాయలకు పైబడి వ్యాపారం జరిగింది. దీంతో కార్మికులు, కొలగార్లు, వర్తకులు కాసింత ఊరట పొందారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్, గవర్నర్ పాలన వంటి అంశాలు అమల్లో ఉన్నందున కొత్త ప్రభుత్వం కొలువుదీరాక నల్లబెల్లం సమస్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
 
రూ.10 కోట్ల లావాదేవీలకు బ్రేక్
 
గత 8 రోజులుగా అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో లావాదేవీలు నిలిచిపోవడంతో సుమారు 10 కో ట్ల రూపాయల వ్యాపారం నిలిచిపోయింది. దీ నివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంతోపాటు వర్తకులు, కార్మికులు, కొలగార్లు, రైతులకు బాగా నష్టం జరిగింది. బెల్లాన్ని రవాణా చే సే వాహన యజమానులకు, వాటిపై పనిచేసే డ్రైవర్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. మొత్తమ్మీద సమస్య తాత్కాలికంగానైనా పరిష్కారం కావడంతో మార్కెట్‌పై ఆదారపడే అన్నివర్గాలు మళ్లీ ఊరట చెందినట్టయింది.
 

Advertisement
Advertisement