ఆశలపై నీళ్లు..! | Sakshi
Sakshi News home page

ఆశలపై నీళ్లు..!

Published Fri, Nov 21 2014 4:31 AM

ఆశలపై నీళ్లు..! - Sakshi

* జిల్లాపై వివక్ష
* రాష్ట్రంలోనే అతితక్కువ పోస్టులు
* ఉసూరుమంటున్న డీఎస్సీ  అభ్యర్థులు

కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయిందన్న ఆనందం జిల్లా అభ్యర్థుల్లో ఎక్కువసేపు నిలువలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీఎస్సీ విడుదలలో సైతం తన సొంతజిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రతిపక్షనేత జిల్లా అయిన వైఎస్‌ఆర్ జిల్లాకు మాత్రం మొండిచేయి చూపారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 1606 పోస్టులు ఖాళీలుగా చూపగా, వైఎస్‌ఆర్ జిల్లాలో అత్యల్పంగా కేవలం 356 పోస్టులు మాత్రమే చూపారు. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేలాదిమంది డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లుచల్లినట్లైంది.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి నిరుద్యోగులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూనే వచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్  విషయంలో పలుమార్లు మానవవనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు మాటతప్పారు. మొదటగా సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పి.. అనంతరం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పిస్తామంటూ లేనిపోని ఆశలు కల్పించారు. దీంతో బీఈడీ అభ్యర్థులు సైతం తమని తప్పుదోవ పట్టించారన్న ఆగ్రహం వారిలోఉంది.
 
జిల్లాకు 356 పోస్టులు .
డీఎస్సీ నోటిఫికేషన్‌లో వైఎస్‌ఆర్ జిల్లాకు కేవలం 356 ఖాళీలు చూపారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 206, స్కూల్ అసిస్టెంట్ 104, లాంగ్వేజి పండిట్స్ 40, పీఈటీలు 6 మాత్రమే చూపారు. నోటిఫికేషన్‌లో తక్కువ ఖాళీలు చూపడం పట్ల జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న దాదాపు 30వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. వేలాదిరూపాయలు వెచ్చించి ఇప్పటికే శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు సైతం పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

Advertisement
Advertisement