వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దుష్ర్పచారం | Sakshi
Sakshi News home page

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దుష్ర్పచారం

Published Mon, Dec 29 2014 2:23 AM

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దుష్ర్పచారం - Sakshi

టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దురుద్దేశ ప్రచారం
పార్టీ వీడుతున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎక్కడైనా చెప్పారా?
హామీలను నెరవేర్చలేని టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది
ప్రభుత్వ వైఫల్యాలపై జనవరి 21, 22 తేదీల్లో తణుకులో జగన్ దీక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి

సాక్షి, హైదరాబాద్: అధికారపక్షం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తెలుగుదేశం పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా, కొన్ని పత్రికలు దురుద్దేశంతో పనిగట్టుకుని మరీ వైఎస్సార్ కాంగ్రెస్ ఖాళీ అవుతోందనీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లి పోతున్నారనీ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ధ్వజమెత్తారు.

ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని.. అన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెళ్లిపోతున్నారని వార్తలు రాస్తున్నారంటూ.. నిజానికి తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన ఎక్కడైనా చెప్పారా? చంద్రబాబు పాలన బాగుందన్నారా? లేక బీజేపీలో చేరుతున్నానని చెప్పారా? అని ప్రశ్నించారు. ‘‘అసలు ఎవరైనా ఏం చూసి టీడీపీలోకి వెళతారు? గత ఆరు నెలలుగా ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న ఆ పార్టీలోకి ఎవరైనా ఎందుకు వెళతారు?’’ అని పార్థసారథి విస్మయం వ్యక్తం చేశారు.

‘‘టీడీపీ నేత, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా రుణ మాఫీ సరిగ్గా అమలు జరగడం లేదన్నారు. రెవెన్యూ మంత్రినైనా తనకు తెలియకుండానే రాజధాని ప్రాంతంలో భూసేకరణ కార్యక్రమం చేపడుతూ ఉండటంపై ఆ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని గత ఆరు నెలల్లో ప్రజలకు ఏమీ చేయలేక పోయామని బాహాటంగానే విమర్శలు చేశారు.

ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని చంద్రబాబు మంత్రులను మాత్రమే దోషులుగా నిలిపే యత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న టీడీపీలోకి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎందుకు వెళ్లాలనుకుం టారు?’’ అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, మహిళలు, నిరుద్యోగుల పక్షాన పోరాడ్డానికి ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారన్నారు.ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 21, 22 తేదీల్లో తణుకులో దీక్ష చేయబోతున్నారని ఆయన ప్రకటించారు.

Advertisement
Advertisement