ప్రతి గింజా కొనుగోలు చేస్తాం | Sakshi
Sakshi News home page

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

Published Wed, Apr 17 2024 8:15 AM

పరిగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి - Sakshi

పరిగి: రైతులు దళారులను నమ్మి మోసపోరాదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డులో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం మంచి మద్దతు ధర ఇస్తోందన్నారు. క్వింటాలు ఏ గ్రేడ్‌ వరికి రూ. 2,203, బీ గ్రేడ్‌కు రూ. 2,183 ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. తూకం మిషన్లు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమ శాతం కొలిచే మీటర్లు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని మినీ గ్రౌండ్‌లో గల ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ రాజేశ్వర్‌, వ్యవసాయశాఖ జిల్లా అధికారి గోపాల్‌, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్‌ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య రావొద్దు

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం మండలంలోని నస్కల్‌ గ్రామంలో తాగునీటి సరఫరాపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి నీటి సరఫరా చేస్తున్న బావిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని చేతిపంపులు, బోరు బావులకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రజలు నీటిని వృథా చేయరాదన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు.

పెండింగ్‌ దరఖాస్తులు పూర్తిచేయండి

ఓటరు నమోదులో పెండింగ్‌ దరఖాస్తులన్నింటినీ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్‌సభ ఎన్నికలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఏఆర్‌ఓల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యా నాయక్‌, ఆర్డీఓలు వాసుచంద్ర, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్‌ నారాయణరెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement