పంజాగుట్ట కేసులో మరో ట్విస్ట్‌.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షాక్‌ | Telangana Police Issues Look Out Notice To BRS Ex MLA Shakeel, Details Inside - Sakshi
Sakshi News home page

పంజాగుట్ట కేసులో మరో ట్విస్ట్‌.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షాక్‌

Published Tue, Feb 6 2024 12:25 PM

TS Police Look Out Notice To BRS Ex MLA Shakeel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బోధన్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో డీసీపీ విజయ్‌ కుమార్‌ కీలక విషయాలను వెల్లడించారు. 

ఈ కేసు విషయమై తాజాగా డీసీపీ విజయ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్‌ మాజీ ఎ‍మ్మెల్యే షకీల్‌కు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్‌ సహకరించాడు. రాహిల్‌తో పాటుగా షకీల్‌ కూడా దుబాయ్‌కి పారిపోయాడు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌తోపాటుగా బోధన్‌ సీఐని కూడా అరెస్ట్‌ చేశాం. నిందితుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశాం. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని వెల్లడించారు. 

ప్రజాభవన్‌ వద్ద హల్‌చల్‌..
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్.. కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పోలీస్ స్టేషన్‌ నుంచి ప్రధాన నిందితుడైన సాహెల్‌ను తప్పించి.. అతని డ్రైవర్‌‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే.. సాహెల్‌ను తప్పించటంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది సహకరించినట్టు ఆరోపణలు రావటంతో.. ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అప్పటికే.. సాహెల్ దుబాయ్ పారిపోగా.. అతనిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

సీఐ దుర్గారావు అరెస్ట్‌
మరోవైపు.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సీఐ దుర్గారావు డ్యూటీలో ఉన్నట్టు.. అతనే నిందితున్ని తప్పించటంతో కీలకంగా వ్యవహరించినట్టు దర్యాప్తులో తేలటంతో.. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును వెతుకుతున్న క్రమంలో.. అనంతపురం గుంతకల్ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడు. సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు దుర్గారావును హైదరాబాద్ తీసుకొచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement