TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం

Published Tue, Dec 19 2023 2:13 PM

TS Congress Govt Meeting Junior Doctors Positive Response - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్‌ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. 

టైం టు టైం స్టైఫండ్‌ రిలీజ్‌తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్‌ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు.  

స్టైఫండ్‌ కోసం గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్‌ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్‌ వసతులతో పాటు కొత్త హాస్టల్స్‌ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్‌ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. 

Advertisement
Advertisement