కాపాడలేం.. అమ్మేద్దాం! | Sakshi
Sakshi News home page

కాపాడలేం.. అమ్మేద్దాం!

Published Sat, Feb 3 2024 4:44 AM

Telangana State Government Scheme on Housing Board Dil Lands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హౌసింగ్‌ బోర్డు, దానికి అనుబంధంగా ఉన్న ‘డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (దిల్‌)’ఆధీనంలోని భూములను అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల నిర్వహణ కోసం భారీగా నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ భూముల విక్రయంపై దృష్టిసారించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గృహనిర్మాణ శాఖ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలిసింది. సదరు భూములపై ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. 

తొమ్మిదో షెడ్యూల్‌లో ఉండటంతో.. 
ఉమ్మడి రాష్ట్ర సమయంలో.. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇళ్లను సమకూర్చేలా హౌసింగ్‌బోర్డు ఆధ్వర్యంలో కాలనీలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. బోర్డు ఏర్పడే నాటికే తెలంగాణ ప్రాంతంలో దాని ఆ«దీనంలో భారీగా భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో కూడా బోర్డు భూములను సమకూర్చుకుంది. ఇందులో భారీ వెంచర్ల కోసం ప్రత్యేకంగా ‘డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లాండ్‌ హోల్డింగ్స్‌ లిమిడెడ్‌ (దిల్‌)’పేరిట అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో దిల్‌ పరిధిలో 1,800 ఎకరాల భూములు, హౌసింగ్‌ బోర్డు ఆ«దీనంలో మరో 820 ఎకరాల భూములు ఉన్నాయి.

అయితే ఈ భూముల అంశం రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం పరిధిలో ఉంది. హౌజింగ్‌బోర్డు, దిల్‌లకు సంబంధించి ఏ ప్రాంతంలోని భూములు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ పట్టుబట్టినా.. షీలా భిడే కమిటీ భిన్న నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ అంశం అలాగే తొమ్మిదో షెడ్యూల్‌లో తెగని పంచాయితీగా ఉండిపోయింది. హైకోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో సదరు భూములను అమ్మేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారుతోంది. 

కాపాడలేమంటూ కేంద్రం దృష్టికి.. 
హౌసింగ్‌బోర్డు, దిల్‌ భూములు కీలక ప్రాంతాల్లో ఉండటంతో వాటిపై కబ్జారాయుళ్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా భూములపై వివాదాలు మొదలయ్యాయి. ఈ భూముల విక్రయానికి ప్రక్రియ మొదలుపెట్టగానే.. అభ్యంతరాలు వస్తాయని, కోర్టులో కేసు ఉండగా ఎలా అమ్ముతారన్న ప్రశ్న వస్తుందని సర్కారు ముందుగానే అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇటు కోర్టుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భూముల పరిరక్షణ సవాల్‌గా మారిందన్న విషయాన్ని తెలియపర్చాలని భావిస్తోంది. ‘‘ఇప్పటికే చాలా భూములు వివాదంలో ఉన్నాయి.

వాటితోపాటు క్లియర్‌గా ఉన్న మిగతా భూములను పరిరక్షించటం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కబ్జాలు ఇంకా పెరిగి వివాదాలు కోర్టుల్లో పెరిగేంత వరకు ఉపేక్షించటం సరికాదు. ఈ భూములకు సంబంధించి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. ముందు వాటిని వేలం ద్వారా విక్రయించి, వచి్చన డబ్బును తదనుగుణంగా వినియోగించుకోవచ్చు. అందుకు వీలు కల్పించాలి’’అని కోర్టును కోరాలని యోచిస్తోంది. కేంద్రానికి కూడా ఇదే వివరించాలని.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ ప్రతినిధిని కూడా నియమించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement