గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్‌  | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్‌ 

Published Sun, Feb 25 2024 3:21 AM

Promotion tension in gurukuls: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్‌ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి.  

సీనియారిటీ జాబితాలు సిద్ధం  
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్‌), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి.  

ఆలస్యమైతే.. అంతే  
టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్‌ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్‌ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.  

ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు 
చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి 

సీనియర్లు నష్టపోతారు 
కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం.     – సీహెచ్‌.బాలరాజు,    తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల     ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు  

Advertisement
 
Advertisement
 
Advertisement