ముఖం మీదే డోర్‌ వేసేశాడు! పాపం రుతురాజ్‌.. వీడియో వైరల్‌ | Ind vs SA: Team Bus Driver Shuts Door Just When Ruturaj To Enter, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ind vs SA: ముఖం మీదే డోర్‌ వేసేశాడు! పాపం రుతురాజ్‌.. వీడియో వైరల్‌

Published Mon, Dec 18 2023 4:07 PM

Ind vs SA: Team Bus Driver Shuts Door Just When Ruturaj To Enter Video Viral - Sakshi

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. టీమ్‌ బస్‌ డ్రైవర్‌ అతడి పట్ల వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. సఫారీ గడ్డపై టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. వన్డేలను విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే.

జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, టీమిండియా యువ పేసర్ల ధాటికి ప్రొటిస్‌ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐదు, ఆవేశ్‌ ఖాన్‌ 4 వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలో 27.3 ఓవర్లనే సఫారీల కథ ముగిసింది. భారత బౌలర్ల విజృంభణతో ఆతిథ్య జట్టు కేవలం 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పది బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.

అయితే, అరంగేట్ర ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 55(నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌(52) అర్ధ శతకాలు బాదడంతో 16.4 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్‌ను ఛేదించింది. కేవలం రెండు వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేసిన రాహుల్‌ సేన ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

ఈ నేపథ్యంలో.. తొలి వన్డేలో రుతురాజ్‌ గైక్వాడ్‌ వైఫల్యాన్ని టీమ్‌ బస్‌ డ్రైవర్‌తో ముడిపెడుతూ చేస్తున్న మీమ్స్‌ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ఫోన్లో మాట్లాడుతూ.. రుతురాజ్‌ బస్‌ ఎక్కేందుకు సిద్ధం కాగా డ్రైవర్‌ డోర్‌ను మూసేశాడు. అంతేకాదు.. బయటే ఉండు అన్నట్లు సైగ కూడా చేసినట్లుగా కనిపించింది. దీంతో రుతు బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘రుతురాజ్‌ ఈరోజు మ్యాచ్‌లో బాగా ఆడడని తెలిసే.. ఇక బస్సెక్కాల్సిన పనిలేదని డ్రైవర్‌ ఇలా చేశాడు’’ అంటూ కొందరు.. ‘‘చెత్తగా ఆడాడు కాబట్టే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఇలా డోర్లు మూయించాడు’’ అని మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. కాగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెయింట్‌ జార్జ్‌ పార్కులో మంగళవారం రెండో వన్డే జరుగనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement