Revanth Reddy: సమరానికి సై! | Sakshi
Sakshi News home page

Revanth Reddy: సమరానికి సై!

Published Mon, Jul 12 2021 11:54 AM

With takeover Of Revantareddy TPCC Chief Seems To Be  New Josh In Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా పరిధిలోని మల్కాజిగిరి ఎంపీ రేవంతరెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టటంతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. అదే ఉత్సాహాన్ని జిల్లాలో కొనసాగించేందుకు యువత, మహిళలను కాంగ్రెస్‌ వైపు ఆకర్షించేందుకు వారు ఎదుర్కొంటున్న తాజా సమస్యలపై ఫోకస్‌ పెంచి సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలోపేతానికి కేడర్‌ను సిద్ధం చేసేందుకు డీసీసీ యోచిస్తున్నది.

జిల్లా స్థాయి నుంచి డివిజన్‌, వార్డు, గ్రామ స్థాయి వరకు ప్రజా సమస్యలను గుర్తించి, పాలకవర్గాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జోడించి ఆయా స్థాయిల్లో దశలవారీ ఆందోళనకు కేడర్, నాయకులు నడుంబిగించేలా కార్యాచరణ ఖరారుకు చర్యలు తీసుకుంటుంది. గ్రేటర్‌ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, శివారులోని మరో నియోజకవర్గంలో ప్రజాందోళనలు బలంగా నిర్వహించటం ద్వారా కాంగ్రెస్‌ ప్రతిష్టను పెంచాలనుకుంటుంది. కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న నాయకులు, కేడర్‌ను ఆయా కమిటీల్లో ఇముడ్చుకునేందుకు జిల్లా నుంచి క్షేత్ర స్థాయి వరకు కమిటీల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నది. 

వ్యూహప్రతి వ్యూహాలతో... 
► మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తాజాగా భేటీ నిర్వహించి సంస్థాగత బలోపేతానికి చేపట్టాల్సిన కసరత్తు, వ్యూహ, ప్రతి వ్యూహాలు, బలం, బలహీనతలు, కమిటీల పునరుద్ధరణ, ఆందోళన కార్యక్రమాలు, నాయకులు, కేడర్‌ గుర్తింపు, పారీ్టలో చిన్నాపెద్ద తేడా లేకుండా  సమష్టిగా పని చేయటం వంటి విషయాలపై చర్చించారు.  
 జిల్లాలో మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి ఒక జడ్పీటీసీ సభ్యుడిసహా ఇద్దరు మండల ప్రజాపరిషత్‌ ఉపాధ్యాక్షులు, 11 మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు సర్పంచులు , 15 మంది కార్పొరేటర్లు, 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. శివారుల్లో పార్టీ బలపడటానికి గట్టి నాయకత్వం ఉండగా, గ్రేటర్‌లో నాయకులు, కేడర్‌ను పెంచుకోవాల్సిన అంశంపై ఇష్టాగోష్టిలో  చర్చించారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మేడ్చల్‌ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందుకు తగినట్టుగా సంస్థాగత బలోపేతం, ప్రజాందోళనలు, నాయకులు, కేడర్‌ పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయన హుందాతనాన్ని మరింత పెంచాలని పలువురు నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం.  
పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 12న ఉప్పల్‌లో చేపట్టనున్న ర్యాలీతోపాటు 16న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలను ముఖ్యంగా యువత, మహిళలను సమీకరించటం ద్వారా అధిష్టానం దృష్టిలో పడాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. 
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలను ఫోకస్‌ చేస్తూ.. వరుస క్రమంలో ఆందోళనలు చేపట్టేందుకు భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement